ఇంకా 8 జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు అందని జీతాలు 

కేసీఆర్ స‌ర్కార్ ఉద్యోగుల‌ను తీవ్ర నిర్ల‌క్ష్యం చేస్తోందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి విమర్శించారు. మే నెల ప్రారంభమై 10వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులకు ఏప్రిల్‌ వేతనాలు వెయ్య‌లేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. 

ప్రతి నెలా జీతాల కోసం ఉద్యోగులు ఇలాగే నిరీక్షించాల్సి వస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏ జిల్లా ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయోనని తమలో తాము చర్చించుకునేలా పరిస్థితి దిగజారిందని ఉద్యోగులే అంటున్నరని ఆమె ధ్వజయంట్టారు. 

జీతాలు సకాలంలో రాకపోవడంతో బ్యాంకుల నుంచి తాము పొందిన రుణాలకు గడువులోగా ఈఎంఐలు చెల్లించలేకపోతున్నమని ఉద్యోగులు వాపోతున్నరని ఆమె తెలిపారు.  ఈ పరిస్థితి ఆసరాగా చేసుకుని బ్యాంకులు పెనాల్టీ రూపంలో సొమ్ము చేసుకుంటున్నయని ఆమె చెప్పారు.  ఇప్పటి వరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల ఉద్యోగులకు మాత్రమే ఏప్రిల్‌ వేతనాలు ప్ర‌భుత్వం చెల్లించిందని ఆమె పేర్కొన్నారు. 

ఇంకా ఎనిమిది జిల్లాలవారికి చెలించాల్సి ఉందని చెబుతూ మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, సూర్యాపేట, కరీంనగర్‌, కొత్తగూడెం జిల్లాల ఉద్యోగులకు వేతనాలు, సర్వీసు పెన్షనర్లకు పెన్షన్ల సొమ్ము కూడా అందలేదని ఆమె విమర్శించారు. 

వరంగల్‌ జిల్లాలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించినా  పెన్షనర్లకు పెన్షన్‌ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని విజయశాంతి తెలిపారు. ఉద్యోగుల‌కు ఎంతో చేశామ‌ని చెప్పుకునే కేసీఆర్ దగ్గర దీనికేం స‌మాధానం ఉంది? అని ఆమె ప్రశ్నించారు. ఇప్ప‌టికైనా వారి వేతనాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. 

ఉద్యోగుల‌తో పెట్టుకున్న ఏ ప్ర‌భుత్వం కూడా బ‌తికి బట్ట క‌ట్టిన‌ట్టు చ‌ర్రిత‌లో లేదని ఆమె హెచ్చరించారు.  ఉద్యోగుల జీవితాల‌తో ఆడుకునే కేసీఆర్‌కి ఈ ఉద్యోగులే త‌గిన జవాబు చెబుతారని  విజ‌య‌శాంతి స్పష్టం చేశారు.