అమరావతి కేసులో ఏ-1గా చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌

టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏదేమైనా సరే న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు మాజీ మంత్రి పి నారాయణ అరెస్ట్ తాజాగా వెల్లడి చేస్తున్నది. 

ఆయనను 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ చేసినా, అసలు దృష్టి అంతా అమరావతి భూముల కుంభకోణంపైనే అని అర్ధం అవుతున్నది.  నారాయణపై గతంలో అమరావతి భూముల  అంశంపై నమోదైన కేసు దర్యాప్తునకు హైకోర్టు జోక్యంతో  తాత్కాలికంగా బ్రేక్‌ పడినా, తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో నమోదైన సిఐడి కేసులో ప్రధాన నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

 తాజాగా సోమవారం సాయంత్రం కేసు నమోదు చేయడం, అందులో చంద్రబాబును ఏ-1గా, నారాయణను ఏ-2గా పేర్కొనడం గమనిస్తే ఇదంతా ఓ భారీ వ్యూహంగా వెల్లడి అవుతుంది. నారాయణ అరెస్ట్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు నాయుడుపైననే  పడింది. ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించాలని నోటీసులు జారీ చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ రూపకల్పన, చుట్టుప్రక్కల ప్రాంతాల ను కలుపుతూ నిర్మించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్ధారించిన ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది.

ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అనుసంధాన మార్గాల అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేసి నిందితుల జాబితాలో ఏ1 గా చేర్చింది. మొత్తం 14 మంది పేర్లు జాబితాలో చేర్చిన సిఐడి అధికారులు ఈ కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గత నెల ఏప్రిల్‌ 27న వైసిపి ఎమ్యెల్యే  ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాథమిక దర్యాప్తు నిర్వహించిన సిఐడి అధికారులు మే 9 వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మంగళగిరిలోని సిఐడి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 16/2022 లో సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167 అండ్‌ 217 ఐపిసి, సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1)(ఎ) ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్టు-1988 కింద కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో చంద్రబాబు నాయుడుని ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా చేర్చి, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ను ఏ6గా చేర్చారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని, ఫిర్యాదు పత్రాన్ని అధికారులు విజయవాడలోని ఏసిబి ప్రత్యేక కోర్టులో సమర్పించారు. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో ఆర్థిక‌ నేరాల విభాగం అడిషనల్‌ ఎస్పీ జయరామరాజు కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నారు.

కాగా నారాయణను మాత్రం కోర్టు అనుమతి తీసుకుని పిటి వారెంట్‌ మీద ఈ కేసులో అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్నవారిని కూడా కొద్దిరోజుల్లోనే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.