నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న రాజపక్స కుటుంబం

అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనకారుల దాడులు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత వహిస్తూ శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. 

అంతేకాదు హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ భారీ ఉద్రిక్తతల కారణంగా మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు ట్రింకోమలీ నావికా స్థావరంలో తలదాచుకుంటున్నారు. అయితే మహింద్రా కుటుంబం నేవీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఆందోళనకారులు తెలుసుకోవడంతో అక్కడ కూడా నిరసనలు చెలరేగాయి.

హెలికాఫ్టర్‌లో కొలంబో నుంచి రాజపక్స, ఆయన కుటుంబం ఆ నేవీ బేస్‌కు చేరుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రాజపక్స కుటుంబంతో సహా హెలికాఫ్టర్‌లో వెళుతున్న దృశ్యాలు కూడా లంక మీడియాలో ప్రసారం కావడంతో ఆయన వెళ్లిపోయిన విషయం నిజమేనని స్థానిక మీడియా ధృవీకరిస్తోంది. 

రాజపక్స ప్రస్తుతం కుటుంబంతో సహా బస చేస్తున్న ఆ నేవీ బేస్ కొలంబో నగరానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని అధికారిక నివాసమైన టెంపుల్ ట్రీస్ బిల్డింగ్ వద్దకు చేరుకుని ఇంట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు.  బారికేడ్లు దాటుకుని వెళ్లాలని ప్రయత్నించిన వారిని పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి అడ్డుకున్నారు. 

కాంపౌడ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులు లోపలికి పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో.. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం మంగళవారం నాడు మిలటరీకి, పోలీసులకు ఎమర్జెన్సీ అధికారాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రజా ఆస్తులకు నష్టం లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న వ్యక్తులను కాల్చిపడేయాలని త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శ్రీలంక రక్షణమంత్రిత్వశాఖ ప్రతినిధి నలిన్ హెరాత్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. 

ఇప్పట్లో ఈ నిరసన సెగ మహీంద్రా కుటుంబాన్ని అంత తేలిగ్గా  వదిలేట్లు లేదు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడు హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకిపోతుంది. ప్రస్తుతం ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మంది  మరణించగా, 220 మందికి పైగా గాయపడినట్లు అధికారిక సమాచారం.