ఏపీలో తుపాను అలజడి.. బలహీన పడిన అసని

బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని ఈశాన్యం వైపు కదులుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 85 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. గరిష్టంగా 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
 
దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతంలో అనేక జిల్లాలు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 
 
జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. క్రమ క్రమంగా బలహీనపడడంతో కొంత వరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇవాళ మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే కొద్ది సేపటి క్రితం తన దిశ మార్చుకున్న అసాని తుఫాన్ నరసాపురం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 
 
సముద్రతీర ప్రాంతంలో నివశించే వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని ప్రాంతాల్లో బస్సులు, రైళ్లు, విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
 
తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యవసర వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. ఇప్పటికే తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను జిల్లాలకు ప్రభుత్వం పంపింది. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. 
 
తుపాను నేపథ్యంలో హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇప్పటికే మీకు నిధులు ఇచ్చామని, తుపాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తం అవసరమని’’ కలెక్టర్లు, అధికారులకు సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి ఏపీ వెళ్లే 37 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.