చంద్రబాబు పిలుపును తిప్పికొట్టిన సోము వీర్రాజు

వైసీపీ అరాచక పాలన అంతానికి మరో ప్రజా ఉద్యమం రావాలని,  ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపును బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిప్పికొట్టారు. 

 ‘క్విట్‌ జగన్‌… సేవ్‌ ఏపీ’ నినాదంతో  ‘వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమం రావాలి. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం’ అంటూ చంద్రబాబునాయుడు పరోక్షంగా వైసిపి వ్యతిరేకంగా బిజెపి, జనసేన కలసి రావాలని పిలుపు ఇచ్చారు.

ఈ పిలుపుపై వీర్రాజు ఘాటుగా స్పందిస్తూ  ఈ మధ్య కొంతమంది త్యాగానికి సిద్దంగా ఉన్నామని మట్లాడుతున్నారని.. ఇప్పటి వరకు చాలా సందర్భాలలో ఆ త్యాగం గమనించామని అంటూ ఎద్దేవా చేశారు. ఇకపై గమనించడానికి ఏపీ బీజేపీ శాఖ సిద్ధంగా లేదని ఈ మీడియా వేదికగా స్పష్టంగా చెబుతున్నాం’ అంటూ స్పష్టం చేశారు. 

`అభివృద్ది, సంక్షేమం మన దగ్గర ఉంది.. ఈ కుటుంబ పార్టీల కోసం మనం త్యాగం చేయాల్సిన అవసరం లేదు. త్యాగధనులంతా తెలుసుకోండి.. మేము అవినీతి రాజకీయాలకు, కుటుంబ పార్టీలకు వ్యతిరేకం. 2024 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అంటూ టిడిపితో కలిసే ప్రసక్తి లేదని  సోమువీర్రాజు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.