మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగడాలు భరించలేకపోతున్నాం

‘‘సార్… మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగడాలు భరించలేకపోతున్నాం. మాపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాకు పెన్షన్లు రావడం లేదు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదు., సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మీరే కాపాడాలి’’ అంటూ ముదిరాజ్ కులస్తులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 23వ రోజు పాలమూరు పట్టణంలో పాదయాత్ర చేశారు. అంబా భవాని ఆలయం వద్ద ముదిరాజ్ కులస్తులతో  సంజయ్ ‘ముఖా-ముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజు కులస్తులు టీఆర్ఎస్ పాలనలో తమకు జరుగుతున్న అన్యాయం, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలు, వేధింపులను ఏకరువు పెట్టారు.
 
 ‘‘ఉమ్మడి ఏపీలో చూసుకున్నా…. ప్రస్తుత తెలంగాణలో చూసుకున్నా ముదిరాజుల సంఖ్య ఎక్కువ. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. శాసనసభలో సంఖ్యాపరంగా చూస్తే సగానికి సగం ముదిరాజులు ఉండాలి. ముదిరాజులది ప్రధాన వృత్తి చేపల వృత్తి. చేపల చెరువులలో కూడా మాకు అన్యాయం జరుగుతోంది. చేపల చెరువులను అమ్ముకుంటున్నారు… మా హక్కులను కాలరాస్తున్నారు’’అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
 ‘‘మమ్ములను బీసీ-డి నుంచి బీసీ-ఎ లోకి మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. గతంలో జీవో 15 ద్వారా మమ్మల్ని బీసీ-ఎ లోకి మారిస్తే… ఒక సంవత్సరం పాటు బీసీ-ఎ లో ఉన్నాం. ఆ తర్వాత సుప్రీం కోర్టులో అదే పార్టీ వేరే కులస్తులతో జిఓ15 కు వ్యతిరేకంగా పిటిషన్ వేయించి, మమ్మల్ని ఆగమాగం చేశారు” అని ఆరోపించారు. 
 
ముదిరాజుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఆ నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి ఇవ్వలేదని పేర్కొన్నారు. బీసీ-ఎ లో కలిపితే తమకు ఉద్యోగాలు అయినా వస్తాయని తెలిపారు. 
 
పైగా, స్థానిక మంత్రి ఇక్కడి ముదిరాజ్ లపై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మంత్రి తన అనుచరులతో ఇక్కడి భూములు కబ్జాలు చేయిస్తున్నారని, తమ మా చెరువుల మీద దాడులు చేయిస్తున్నారని తెలిపారు. తాము పూలు అమ్మాలన్నా… చేపలు అమ్మాలన్నా…  ఎక్కడ కూడా అమ్మకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. 
 
ముదిరాజుల సమస్యలను సావధానంగా విన్న సంజయ్ వారికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లాగా బీజేపీ భయపడేది కాదని చెబుతూ ముదిరాజులతో పాటు పద్మశాలీలు, యాదవులుసహా హిందువుల్లో ఐక్యత రావాలని, అందుకోసం తాను క్రుషి చేస్తున్నామని తెలిపారు.