పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ

సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్వీకరించింది.  మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా స్పందించిన ఎన్హెచ్ఆర్సీ అందరూ చూస్తుండగానే దాడి చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఈ ఘటన చట్టాన్ని లెక్కచేయకపోవడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ఈ ఘటనకు సంబంధించి నాలుగు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పరువు హత్య ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.

మతాంతర వివాహం చేసుకున్న నాగరాజు హత్యపై తెలంగాణ గవర్నర్‌ డా.  తమిళిసై సౌందరరాజన్ కూడా స్పందించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు.

మరోవైపు కేసు దర్యాప్తు వివరాలను సమర్పించాలని, మృతుని భార్య రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున సాయం ఏమైనా అందించారో చెప్పాలని డీజీపీని ఆదేశించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో కమిషన్ కు వెల్లడించాలని చెప్పింది.

మరోవైపు  “ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నందుకు దళిత యువకుణ్ణి కొట్టి చంపారు” అంటూ బిజెపి ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్  తరుణ్ చుగ్ చేసిన ట్వీట్‌పై జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విజయ్ సాంప్లా స్పందించారు. ట్విట్టర్ వేదికగానే స్పందించిన సాంప్లా, ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ సమర్పించాల్సిందిగా తెలంగాణ పోలీసు యంత్రాగాన్ని ఆదేశించారు. 

వెనువెంటనే స్పందించిన విజయ్ సాంప్లాకు కృతజ్ఞతలు చెబుతూ తరుణ్ చుగ్ మరో ట్వీట్ చేశారు. మరోవంక, ఆయన నేడు స్వయంగా నాగరాజు కుటుంభ సభ్యులను పర్యటించనున్నారు

కాగా, జాతీయస్థాయిలో తనను తాను ఓ విజయవంతమైన నేతగా చిత్రీకరించుకునే ప్రయత్నాల్లో మునిగితేలుతున్న తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్ రావు, పట్టపగలే నడిరోడ్డుపై ఓ దళిత యువకుణ్ణి ఇనుప రాడ్లతో కొట్టి చంపుతుంటే మౌనం వహించారని తరుణ్ చుగ్ ఆరోపించారు. 
 
తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కేసీఆర్ చెప్పినట్టుగా నడచుకునే పనిముట్లుగా మారొద్దని, ఇకనైనా ప్రజల కోసం పనిచేయాలని చుగ్ హితవు పలికారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన దారుణ హత్యాకాండపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  దళితబంధు అంటూ దళితులను మోసగిస్తున్న కేసీఆర్ సీఎం కేసీఆర్, ఇప్పుడు నడిరోడ్డుపై ఓ దళిత యువకుణ్ణి కొట్టిచంపుతుంటే మౌనం వహించారని మండిపడ్డారు.
 
కాగా,  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నాగరాజు హత్యను తీవ్రంగా ఖండించారు. దారుస్సలాంలో నిర్వహించిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఒవైసీ ప్రసంగిస్తూ.. “సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆమె(ఆశ్రిన్ సుల్తానా) తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తిని (నాగరాజు) పెళ్లి చేసుకుంది. అది సరైన చర్యే. కానీ,  సుల్తాన్ సోదరుడికి ఆమె భర్తను చంపే హక్కు ఎక్కడిది? రాజ్యాంగం ప్రకారం హత్య చేయడం క్రూరమైన చర్య, ఇస్లాం ప్రకారం దారుణమైన నేరం కూడా” అని స్పష్టం చేశారు.