కరోనాను గెలిచిన భారత్ … బిల్ గేట్స్ ప్రశంస

ప్రపంచ స్థాయిలో అత్యంత సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్ తయారీ దిశలో సమగ్ర పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్)డి ప్రక్రియ జరగాల్సి ఉందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చెప్పారు. పూర్తి స్థాయిలో వైరస్ నియంత్రణ సాధ్యం కావాలి. వ్యాక్సిన్ అత్యంత సుదీర్ఘకాలం పనిచేయగలగాలి. ఇటువంటి వినూత్న తరపు అవసరాల టీకాల తయారీ దిశలో భారతదేశం కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.

సరికొత్త వ్యాక్సిన్ దిశలో పరిశోధనలు మరింత విస్తృతం కావల్సి ఉందని సూచించారు. వైరస్ సంక్రమణ జరగని రీతిలో రోగనిరోధకత ఏర్పడాల్సి ఉందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా  వైరస్ బాగా దెబ్బతీసిందని చెబుతూ  ఈ క్రమంలో ఇప్పుడు కరోనా  మరణాల సంఖ్యపై వివాదాలు చెలరేగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

భారతదేశంలో ఈ మరణాల సంఖ్య సంపన్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని, ఇది వివాదం అయినప్పటికీ లేనప్పటికి ప్రజాస్వామ్య యుత దేశం అయిన భారత్‌లో ఈ మరణాల సంఖ్యపై నిర్మోహమాట చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు.

మరణాల సంఖ్య గురించి పక్కకు పెడితే భారత్  అత్యంత సంపన్న దేశం అమెరికాను కూడా తోసిరాజంటూ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో అచిరకాలంలోనే ముందుకు దూసుకువెళ్లిందని ఆయన ప్రశంసించారు. అయితే, మరణాల విషయంలో అన్ని దేశాలు వాస్తవాలను దాచిపెట్టే ఉంటాయని పేర్కొన్నారు. 

ఉత్తత్తి, పంపిణీ, వ్యాక్సినేషన్ల క్రమంలో `ఇండియా గ్రేట్’ అని కొనియాడారు. మహమ్మారి వచ్చింది, ఇక తరువాత పరిస్థితి ఏమిటీ? మరో రకం వైరస్ నివారణ ఏ విధంగా జరుగుతుందనే అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఇటీవలే ఓ పుస్తకం కూడా రాశారు. 

తీవ్రస్థాయి వైరస్ ఇక రాకపోవచ్చు అని, అయితే 50 ఏండ్లు దాటిన వారు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. బూస్టర్ డోస్‌లతో సిద్ధంగా ఉండాలని, కొన్ని ప్రాంతాలలో కొత్త వేరియంట్లతో వైరస్ విజృంభిస్తుందనే వాదన దశలో అప్రమత్తత అవసరం అని ఆయన హెచ్చరించారు.