తెరచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయం

జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ ఆలయం తెరచుకుంది. ఈ రోజు ఉదయం 6.26 గంటలకు వేద మంత్రోచ్ఛారణలు, శివనామ స్మరణమధ్య ఆలయ ద్వారాలు తెరచుకున్నాయి. ఆలయ పునఃప్రారంభం సందర్భంగా క్షేత్రాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. 
 
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి, సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్యతో కలిసి శుక్రవారం కేదార్‌నాథ్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున హర హర మహాదేవ, భం భం భోలేనాథ్ అంటూ భక్తిపారవశ్యంతో నినాదాలు చేశారు.
కొందరు భక్తులు వేద మంత్రాలను పఠించారు. ఈ దేవాలయాన్ని భక్తుల కోసం తెరిచిన సందర్భంగా 15 క్వింటాళ్ళ పూలతో అలంకరించారు.  కరోనా కారణంగా రెండేళ్ల పాటు చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 8న బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు.

గంగోత్రికి రోజుకు 7వేల మందిని.. యమునోత్రికి రోజుకు 4 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు. కేదార్ నాథ్ ఆలయ దర్శనానికి రోజుకు 12 వేల మందిని అనుమితించనున్నట్లు తెలిపారు. కోవిడ్ సంబంధిత ఆంక్షలు చాలా వరకు తొలగిపోవడంతో భక్తులు హర్షాతిరేకాలతో తరలివస్తున్నారు.

చార్‌ధామ్‌ యాత్రికుల కోసం ఓ ప్రైవేటు హెల్త్ ఆర్గనైజేషన్ అందజేస్తున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం ప్రారంభించారు. ఈ యాత్రలో పాల్గొనే భక్తుల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

చార్‌ధామ్ యాత్ర మే 3న ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రిలను భక్తుల కోసం తెరవడంతో ఈ యాత్ర ప్రారంభమైంది. చార్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులు గుప్త కాశీ, సోన్ ప్రయాగ్ లోని వైద్య కేంద్రాల దగ్గర హెల్త్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. భక్తుల బీపీ చూసి.. ఆరోగ్యం సహకరిస్తే.. వైద్య ధ్రువీకరణ పత్రం ఇస్తారు. చార్ ధామ్ యాత్రకు డాక్టర్ సర్టిఫికేట్ తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు.