లింగ నిష్పత్తిలో అగ్రగామిగా లడఖ్

దేశం మొత్తం మీద ఎత్తైన పర్వత ప్రాంతాలలో, సరిహద్దుల్లో ఉన్న కేంద్ర పాలితప్రాంతం లడఖ్ ఆధునిక అభివృద్ధిలో వెనుకబడి ఉండవచ్చు. కానీ లింగ నిష్పత్తిలో మాత్రం మొత్తం దేశానికే ఆదర్శంగా నిలిచి, ముందంజలో ఉంది. దేశం అంతటా మహిళా జనాభా తగ్గిపోతున్నదని ఆందోళన చెందుతూ ఉండగా, ఇక్కడ మాత్రం ప్రతి 1000 మంది పురుషులకు 1104 మంది మహిళలు ఉన్నట్లు 2020 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం నివేదిక వెల్లడించింది. 
2020 ఏడాది గణాంకాల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌లో రికార్డు స్థాయిలో లింగ నిష్పత్తి నమోదయింది. తరువాత స్థానాల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, త్రిపుర, కేరళ ఉన్నాయి. ఈ నెల 3న రిజిస్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జిఐ) ఈ నివేదిక విడుదల చేశారు. 

2020లో నమోదైన జననాల ప్రకారం అత్యధిక లింగనిష్పత్తి లడఖ్‌ (1104)లో నమోదయింది. తరువాత స్థానాల్లో అరుణాచల్‌ప్రదేశ్‌ (1011), అండమాన్‌ నికోబార్‌ దీవులు (984), త్రిపుర (974), కేరళ (969) ఉన్నాయి’ అని నివేదిక వెల్లడించింది.

జన్మించిన వారిలో ప్రతి వెయ్యి మంది బాలురకు, బాలికల సంఖ్యను లింగనిష్పత్తిగా పేర్కొంటారు. 2020లో అత్యల్ప లింగనిష్పత్తి మణిపూర్‌లో నమోదయింది. ఇక్కడ 1000 మందికి 880 మంది బాలికలే జన్మించారు. తరువాత దాద్రానగర్‌ హవేలి డమాన్‌ అండ్‌ డయ్యూలో 898, గుజరాత్‌లో 909, హర్యానాలో 916, మధ్య ప్రదేశ్‌లో 921 మంది మహిళలు ఉన్నారు. 2019లో అత్యధిక లింగ నిష్పతి అరుణాచల్‌ ప్రదేశ్‌ (1024)లో నమోదైంది.

కాగా, 2020 లింగనిష్పత్తిపై మహారాష్ట్ర, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాల గురించి సమాచారం లేదు. 2019లోనూ ఆర్‌జిఐకి ఈ నాలుగు రాష్ట్రాలు సమాచారం ఇవ్వలేదు. జనాభాలో లింగ భేదాన్ని గుర్తించడానికి లింగ నిష్పత్తి ముఖ్యమైన అంశమని నివేదిక తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 880 కంటే తక్కువ నమోదు కాలేదు.

ఇలా ఉండగా, ఈ నివేదిక ప్రకారం 2020లో నమోదైన నవజాత శిశు మరణాలు సంఖ్య 1,43,379గా ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతం భాగం 23.4 శాతం మాత్రమే. మొత్తం నవజాత శిశువుల మరణాల్లో పట్ణణ ప్రాంతం భాగం 76.6 శాతంగా ఉంది. 

గ్రామీణ ప్రాంతాల్లోని నవజాత శిశుమరణాలు నమోదుకాకపోవడం ఆందోళన కలిగిస్తోందని నివేదిక తెలిపింది. జనన, మరణాల నమోదు చట్టం 1969 ప్రకారం జనన మరణాల రిజిస్ట్రార్‌కు జనన మరణాలను నివేదించడం తప్పనిసరి. జనన మరణాలను అవి సంభవించిన ప్రదేశంలో మాత్రమే నమోదు చేస్తారు.