భారత్ లో మరణాల  పెరుగుదలకు కరోనా కారణం కాదు!

దేశంలో 2019తో పోలిస్తే 2020 క్యాలెండర్‌ ఏడాదిలో మరణాల నమోదులో పెరుగుదలకు పూర్తిగా కరోనా కారణం కాదని నీతీ ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ స్పష్టం చేశారు. భారత్‌లో భారీగా కరోనా  మరణాలు సంభవించాయంటూ కొన్ని ఏజెన్సీలు పేర్కొనడాన్ని తక్షణమే ఆపివేయాలని కరోనా టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ అయిన పాల్‌ కోరారు.
 
 ప్రభుత్వం చూపుతున్న గణాంకాల కంటే.. 2020 జనవరి- 2021 డిసెంబరు మధ్య భారత్‌లోకరోనా మృతుల సంఖ్య ఎనిమిది రెట్లు ఉంటుందని ప్రఖ్యాత జర్నల్‌ లాన్సెట్‌ గతంలో పేర్కొంది. ఈ మేరకు చూస్తే.. మన దేశంలో గత ఏడాది డిసెంబరు వరకు కరోనా అధికారిక మరణాలు 4.89 లక్షలు. 
 
లాన్సెట్‌ మాత్రం 40లక్షలమంది చనిపోయారని తన విశ్లేషణలో ప్రస్తావించింది. ఇది ప్రపంచంలో అత్యధికమని కూడా తెలిపింది. దీంతో పౌరుల జనన, మరణాలపై ప్రచురితమైన సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ (సీఆర్‌ఎ్‌స)ను ఉదహరిస్తూ వీకే పాల్‌ స్పందించారు. 
 
మరోవైపు.. దేశంలో 2 నుంచి 18 ఏళ్ల వయసు వారికి కొవాక్సిన్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు.. రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతించాలని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)ను హైదరాబాద్‌ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ కోరింది. గత నెల 29న ఈ మేరకు దరఖాస్తు సమర్పించింది.