ఆదిలాబాద్ కు పేలుడు పదార్థాలు… హర్యానాలో నలుగురు ఉగ్రవాదులు పట్టివేత 

దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలను మహారాష్ట్రలోని నాందేడ్‌కు, తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలించేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ, పంజాబ్‌, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టారని చెప్పారు. 
పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను చేరవేయాలని ప్రయత్నించాడు. ఈ పనిని పంజాబ్‌కు చెందిన నలుగురు వ్యక్తులకు అప్పగించాడు. కానీ ఈ పన్నాగం బయటపడింది. హర్యానాలోని కర్నాల్‌లో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలతో ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని  పోలీసులు పట్టుకున్నారు.
ఆయుధాలు, అమ్మోనియం, ఆర్‌డీఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బస్తర టోల్ ప్లాజా వద్ద వీరిని పట్టుకున్నామని పేర్కొన్నారు. ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం పట్టుబడ్డ నలుగురూ పంజాబ్‌కు చెందినవారే.
ప్రాథమిక సమాచారం ప్రకారం  వీరు నలుగురూ కొరియర్ సర్వీసులు నిర్వహిస్తారని తెలిసింది. పేలుడు పదార్థాలు తీసుకుని తెలంగాణలోని ఆదిలాబాద్‌కు బయలుదేరారని కర్నాల్ రేంజ్ ఇన్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సతేందర్ కుమార్ గుప్తా ప్రకటించారు.
తొలుత వీరిని కోర్టులో ప్రవేశపెడతాం. ఆ తర్వాత రిమాండ్‌లోకి తీసుకుని వివరంగా ప్రశ్నిస్తామని కుమార్ గుప్తా  చెప్పారు.  నలుగురిలో ముగ్గురు ఫిరోజ్‌పూర్, ఒకరు లూధియానాకు చెందినవారని తెలిపారు. నిందితుల పేర్లు గుర్మీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపేందర్‌గా పోలీసులు తెలిపారు. వీరి వ‌య‌స్సు 20 నుంచి 25 సంవ‌త్స‌రాల మ‌ధ్యే ఉంటుందని పేర్కొన్నారు.
అనుమానిత మూడు కంటెయినర్లలో ఆర్‌డీఎక్స్, ముందుగుండు సామాగ్రి, ఒక పిస్టోల్, 31 రౌండ్ల లైవ్ కార్టిడ్జెస్‌లతో పాటు రూ 1.3 లక్షల నగదు  సీజ్ చేసినట్టు అధికారి పేర్కొన్నారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే నాందేడ్ వరకు కొన్ని పేలుడు పదార్థాలను చేర్చినట్లు భావిస్తున్నారు.
 
పంజాబ్‌కు చెందిన వీరు ఖలిస్తానీ ఉగ్రవాదులని, వీరికి పాకిస్తాన్‌తోనూ  సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్జిందర్‌ సింగ్‌ రిండా వీటిని పంపారని, డ్రోన్ల ద్వారా పాకిస్థాన్  సరిహద్దుల నుండి ఈ ఆయుధాలను తీసుకున్నట్లు విచారణలో నిందితులు పేర్కొన్నారని తెలిపారు. 
 
పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిలో ప్రధాన నిందితుడైన గుర్ప్రీత్ గతంలో జైలులో ఉన్న సమయంలో పాకిస్థాన్తో సంబంధమున్న రాజ్బీర్తో పరిచయమైనట్లు పోలీసులు చెప్పారు. గుర్ ప్రీత్తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధముందని తెలిపారు. 
 
వారంతా దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరందరూ మరో ఉగ్రవాది హర్వీందర్ సింగ్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు గుర్తించారు
పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో నిందితులు టచ్‌లో ఉన్నారు. ఆయుధాలు, అమ్మోనియంను తెలంగాణలోని ఆదిలాబాద్ చేరవేయాలని పాకిస్తాన్ వ్యక్తి వీరిని కోరాడని చెప్పారు. కాగా నిందితుల్లో ఒకరైన గుర్మీత్‌కు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి ఆయుధాలు చేరాయని సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యిందని పోలీసులు వెల్లడించారు. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్‌కు పేలుడు పదార్థాలు తరలింపు ప్రయత్న్డం వెనుక ఏమైనా కుట్ర ఉందా? ఆదిలాబాద్‌లో ఏమైనా దాడులు జరపాలని భావించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.