రష్యా చమురుపై యురోపియన్‌ కమిషన్‌ నిషేధం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అమెరికా, ఇయు సహా పలు దేశాలు రష్యాపై ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆరోసారి ఆంక్షల ప్యాకేజీని విధించాలని యురోపియన్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. 
రష్యా చమురుపై నిషేధం విధించడం, ఆరు మాసాల పాటు రష్యన్‌ ముడి చమురు దిగుమతులను నిలిపివేయడం వంటివి ఈ ఆంక్షల్లో భాగంగా వున్నాయి. యురోపియన్‌ పార్లమెంట్‌లో కమిషన్‌ అధ్యక్షులు ఉర్సులా వాన్‌ డెర్‌ లేయన్‌ మాట్లాడుతూ, ఈ కొత్త చర్యలను ప్రకటించారు. ఇయులోని 27 సభ్య దేశాలు వీటిని ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది.
 
 ”కొన్ని సభ్య దేశాలు రష్యన్‌ చమురుపై తీవ్రంగా ఆధారపడ్డాయి. దీనిపై మనం కసరత్తు చేయాల్సి వుంది. రష్యన్‌ చమురుపై నిషేధం విధించాలని మేం ప్రతిపాదిస్తున్నాం. అన్ని రకాల చమురు అంటే పైప్‌లైన్‌ ద్వారా వచ్చే, ముడి, శుద్ధి చేయబడిన చమురులను పూర్తిగా దిగుమతి చేసుకోవడంపై నిషేధం వుంటుంది.” అనివాన్‌డెర్‌ లేయర్‌ చెప్పారు.
 
 హంగరీ, స్లొవేకియాలను మినహాయిస్తునుట్లు తొలుత చెప్పారు. వారికి సుదీర్ఘకాలం పరివర్తనా సమయం ఇచ్చారు. కమిషన్‌ అధ్యక్షులు చేసిన ప్రసంగంలో మాత్రం దాని గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఈ రెండు దేశాలు వరుసగా 58, 96శాతం చొప్పున రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. 
 
అందువల్ల 2023 వరకుతమ కొనుగోళ్లను ఈ దేశాలు కొనసాగించే అవకాశం వుంది. ఇయులోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ క్రమంగా రష్యా ముడి చమురును తగ్గించుకునేందుకు మద్దతిచ్చింది. మొత్తంగా ఇయు దేశాలు 26శాతం మేర రష్యా నుండి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి.
 
ఇలా ఉండగా, రష్యాపై అమెరికా సాగిస్తును పరోక్ష యుద్ధం కారణంగా మొత్తంగా యురోపియన్‌ యూనియన్‌ తన ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టిందని విమర్శలు చెలరేగుతున్నాయి. ఇందుకోసం వారు అనేక త్యాగాలు చేయాల్సి వస్తోందని అంతర్జాతీయ విశ్లేషకుడు, వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ మాజీ అధికారి బసెమ్‌ తజెల్దిన్‌ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 
 
ఐరోపా మొత్తంగా ఈ పరోక్ష యుద్ధం కోసమే పనిచేస్తోంది, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా యూరప్‌ ఈ త్యాగాలకు సిద్ధపడుతోందని పేర్కొన్నారు