జవహర్‌నగర్‌లో లీచెట్‌ శుద్ధిలో రూ.130 కోట్ల కుంభకోణం

వహర్‌నగర్‌లో లీచెట్‌ శుద్ధిలో రూ.130 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ కార్పొరేటర్లు  ఆరోపించారు. బిజెపి పార్టీ కార్పొరేటర్లు దేవర కరుణాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి, రవిచారి, మహేందర్‌లు మీడియాతో మాట్లాడుతూ  జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు క్యాపింగ్‌ మొదలు, లీచెట్‌ శుద్ధి వరకు జీహెచ్‌ఎంసీ చేస్తోన్న పనుల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 
 
రాంకీ సంస్థకు ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ఉన్నతస్థాయి ఆదేశాల మేరకు అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. డంపింగ్‌ యార్డు పరిసరాల్లో లీచెట్‌ ఎంతుందన్నది ఎలా అంచనా వేశారు..? అనంతరం ఎలా పెరిగిందని వారు ప్రశ్నించారు. అంచనా వ్యయం కంటే ఎక్కువ కోట్‌ చేసిన సంస్థకు పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు.
రాంకీ యాజమాన్యం, అధికారులు కుమ్మక్కై.. చెరువులు, కుంటల విస్తీర్ణం, లీచెట్‌ ఎక్కువగా ఉన్నట్టు చూపారని పేర్కొన్నారు. దీనివల్ల రూ.130 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే ఆస్కారం ఏర్పడుతోందని ఆరోపించారు. క్యాపింగ్‌లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రూ.144 కోట్లతో రాంకీకే ఆ పనులు ఇచ్చారని చెప్పారు.
చెత్తకు సంబంధించి ఏ పనయినా రాంకీకి అప్పగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. క్యాపింగ్‌, లీచెట్‌ శుద్ధిలో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, అవినీతి, అక్రమాలకు పాల్పడినఅధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.
సీఆర్‌ఎంపీ బడా కాంట్రాక్టు సంస్థలు, అధికారుల జేబులు నింపే కార్యక్రమమని వారు ఆరోపించారు. రెండేళ్లలో రూ.707 కోట్లు వెచ్చించినట్టు చెబుతున్నారని, ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చూపించాలని డిమాండ్‌ చేశారు.  నగరంలో  గుంత లేని రహదారి చూపిస్తే తాము రూ.1000 ఇస్తామని వారు సవాల్ చేశారు. నాలాల అభివృద్ధి/విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వర్షాలు పడితే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. పనులను వేగిరం చేసి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.