ఉస్మానియాలో రాహుల్ సభపై జోక్యంపై హైకోర్టు నిరాకరణ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాక సందర్భంగా ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో జరుపదలచిన సభకు అనుమతి ఇచ్చే విషయంలో జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకో వలసింది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అని స్పష్టం చేసింది. 
 
విద్యార్థులతో ముఖాముఖి కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించాలని వైస్ ఛాన్సలర్ ను హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల అభ్యర్థనను వీసీ పరిగణలోకి తీసుకుంటారని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఓయూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటకు అనుమతించేలా ఆదేశించాలంటూ పిటిషనర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా.. ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవాదులెవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ క్రమంలో నిర్ణయాన్ని ఓయూ వైస్ ఛాన్సలర్ కు వదిలేసిన న్యాయస్థానం పిటిషన్ పై విచారణను ముగించింది. 

అయితే, అప్పటికే యూనివర్సిటీ ఆవరణలో రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇచ్చేందుకు వైస్ ఛాన్సలర్ నిరాకరించారు. పలు కారణాల దృష్యా సమావేశానికి అనుమతించలేమని స్పష్టం చేశారు. 

రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  వీహెచ్‌ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్‌ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. దానితో రాజకీయ వివాద అంశంగా మారింది. 
 
 ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మంత్రుల క్వార్టర్స్‌ ముట్టడికి యత్నించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ వైస్‌ చాన్స్‌లర్‌ చాంబర్‌ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
2021 జూన్ 22న జరిగిన పాలక మండలి సమావేశంలో రాజకీయ, మతపరమైన సభలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారని, అందుకు రాహుల్ సభకు అనుమతి ఇవ్వలేమని తెలిపారు.  ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఓ లేఖ రాశారు. ఓయూలో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయిస్, ఓయూ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు మే 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్నాయని రిజిస్ట్రార్ ఆ లేఖలో  ప్రస్తావించారు. 
 
ప్రస్తుతం ఎంబీఏ పరీక్షలు కొనసాగుతున్నాయని, మే 9 నుంచి పీజీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నందున సభ వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశముందని పేర్కొన్నారు. యూనివర్సిటీకి చెందిన ఇతర విద్యార్థి సంఘాలు సైతం రాహుల్ పర్యటనపై అభ్యంతరాలు లేవనెత్తాయని, దానితో శాంతిభద్రతల  సమస్య తలెత్తే అవకాశమున్నందున రాహుల్ పర్యటనకు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. 
 
మే 7న ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ సభకు అనుమతివ్వాలంటూ ఎన్ఎస్యూఐ సభ్యులైన మానవతా రాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ యాదవ్, సూర చందన అంతకు ముందు వీసీకి వినతిపత్రం ఇచ్చారు.