ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ల లెక్క తేలుస్తా

ఉపాధి నిధులను ఆపుతోంది కేసీఆరే అని మండిపడుతూ ఉపాధి కూలీలా సొమ్ము తినేవాళ్లు లెక్క తేలుస్తా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ధన్వాడ మండలం మణిపూర్ తండాలో సంజయ్ ను కలిసిన దాదాపు 300 మంది ఉపాధిహామీ కూలీలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. 

వారి సమస్యలు సావధానంగా విన్న సంజయ్  తమకు అదనంగా కనీసం 50 రోజుల పనిదినాలు అయినా పెంచాలన్న వారి కోర్కెకు వెంటనే స్పందించారు. ఈ విషయం ప్రధాన మంత్రి మోదీ దృష్టికి తీసుకు వెడతానని హామీ ఇచ్చారు. 

మూడు నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం తమకు కూలి డబ్బు చెల్లించడం లేదని చెప్పగానే  ఉపాధి కూలీ బకాయిలు అన్నింటిని ఇప్పిస్తానని సంజయ్ భరోసా ఇచ్చారు. తమకు ప్రస్తుతం రోజూ కూలీ రూ. 257+20 ఇస్తున్నట్లు వారు చెప్పారు. అయితే ధన్వాడలో పనిదొరకడం లేదని, తమకు అదనంగా మరో రూ 250 అయినా కూలి ఇప్పించాలని వారు కోరారు. 

ఉపాధిహామీ పథకం కూలీ డబ్బులను కేంద్రం ప్రతి నెల వారానికి ఒకసారి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తుందని చెబుతూ వారానికి ఒకసారి వారి వారి అకౌంట్ లలో ఆ డబ్బు పడాల్సిందే అని సంజయ్ స్పష్టం చేశారు. ఎండాకాలం కావడంతో అదనంగా రూ 20 కూలి ఇస్తున్నట్లు చెప్పారు.

కేంద్రం రాష్ట్రానికి ఉపాధిహామీ కూలీ డబ్బులు ఇస్తుంటే, ఆ కూలీ డబ్బులను వారికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది కేసీఆర్ సర్కార్ అని సంజయ్ విమర్శించారు.  “మీతో గొడ్డు చాకిరీ చేయించొద్దు… మీకు తాగునీరు ఇవ్వాలి, డాక్టర్ ను పెట్టాలి, టెంట్లు వేయించాలనే నిబంధనలు ఉన్నాయి. అవి కేసీఆర్ అమలు చేయడం లేదు” అని మండిపడ్డారు.

వారి కూలి బకాయిలు చెల్లించేటట్లు వారి తరపున కేసీఆర్ ప్రభుత్వంపై తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇకపై నేరుగా ఉపాధి కూలి డబ్బులను వారి ఖాతాలలోనే పడే విధంగా చేయమని ప్రధానిని కొరగలనని చెప్పారు.

“రేపే మొత్తం లెక్కలు తెప్పిస్తా… మీకు అన్యాయం చేసిన వాళ్ళ లెక్క చూస్తా…కేసులు పెట్టిస్తా…వాళ్ళను జైలుకి పంపిస్తా” అని సంజయ్ హెచ్చరించారు.