దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చరిత్రలో ఈ వేసవి అత్యంత తీవ్రమైనదిగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రత్యేకించి మార్చి సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డును నమోదు చేశాయి. 122 ఏళ్లలో అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు ఈసారి మంటెక్కించాయి.
2004లో మార్చి సగటు ఉష్ణోగ్రత 30.67 డిగ్రీల సెల్సియస్ ఇప్పటివరకు అత్యధికం. కాగా ఈ ఏడాది మార్చి సగటు ఉష్ణోగ్రత ఆ మార్క్‌ను దాటేసింది. పైగా ఈ వేసవి ఎన్నడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలతో మండిపోతోందని, ఇది ఓ రికార్డు అని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉదయం 7 గంటలకే సూరీడు చురుక్కు మంటున్నాడు. బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. భారత్ ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణాన్ని చవిచూస్తోంది. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో సాధారణ సగటు ఉష్ణోగ్రతకన్నా ఇది ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువ.
ప్రత్యేకించి వాయువ్యభారతంలోని రాజస్థాన్, ఢిల్లి, హర్యానా, యూపీ, ఒడిశా రాష్ట్రాలకు ఈ ముప్పు ఉందని అప్రమత్తం చేసింది. ఆ ప్రాంతంలో కనీసం ఐదు రోజుల పాటు సగటు కన్నా 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొంది. మే మొదటి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఆర్.కె.జెనమణి పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు వేడి గాలులు ఉండవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు దేశంలోకి అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారత్‌లో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత ఈ వేడి తగ్గవచ్చునని పేర్కొంది.
అలాగే మధ్యభారతంలోని మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీలకన్నా ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. శుక్రవారంనాడు దేశ రాజధానిలో గురువారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా శుక్రవారం 44 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు ఉండొచ్చని పేర్కొన్నారు.
విద్యుత్ సంక్షోభం తప్పదా!
చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్‌కు డిమాండ్ అనూహ్య స్థాయిలో పెరుగుతోంది. మరోవైపు బొగ్గు కొరతతో ఇప్పటికే ఎక్కువ రాష్ట్రాలలో విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ సహా పలు రాష్ట్రాలలో విద్యుత్ కోతల సమయంలో ఎక్కువగా ఉంటోంది.
గడచిన రెండు నెలల్లో మహారాష్ట్రంలో రెండు దఫాలుగా వడగాల్పులు వీచాయి. ఇప్పుడు మరోసారి ఆ ముప్పు ఏర్పడింది. ఇప్పటికే 20 లక్షల టన్నుల బొగ్గు కొరత ఏర్పడటంతో ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇప్పటివరకు ఉన్న బొగ్గు నిల్వలలు మరో రెండు రోజులకే సరిపోతాయి.
విద్యుత్ కోతలు అధికంగా విధిస్తున్న రాష్ట్రాలలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ తరువాతి స్థానంలో రాజస్థాన్ నిలిచింది. ఈ ఎడారి రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 4 గంటలపాటు అధికారికంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరీ అధికంగా ఉంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు, నీటి సంక్షోభం ఏర్పడింది.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!