ప్రపంచం అంటే ఐరోపానే కాదు… ఆసియా వైపూ చూడండి!

ప్రపంచం అంటే ఐరోపా మాత్రమే కాదని, ఓసారి ఆసియాలోని సవాళ్లను కూడా గమనించాలని విదేశాంగమంత్రి ఎస్  జైశంకర్‌  హితవుపలికారు. భారత్‌ పొరుగుదేశాలైన చైనా, అప్గానిస్తాన్‌ నుంచి ఎదురయ్యే సమస్యలను పరిశీలించడం ఐరోపాకు మేలుకొలుపు కాగలదని చెప్పారు.
రష్యా-ఉక్రెయిన్‌ వివాదం కారణంగా తలెత్తుతున్న సంక్షోభంపై ఐరోపా మంత్రులు, నాయకుల ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. రైసినా డైలాగ్‌లో నార్వే విదేశాంగమంత్రి అన్నికెన్‌ హ్యూట్‌ఫెల్డ్‌ అడిగిన ప్రశ్నకు జైశంకర్‌ స్పందిస్తూ, “మీరు ఉక్రెయిన్‌ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఏడాది కిందట అప్గానిస్తాన్‌లో ఏం జరిగిందో గుర్తుందా” అని ప్రశ్నించారు.
 
“ఆసియాలో మేమూ సొంత సవాళ్లను ఎదుర్కొంటున్నాం” అంటూ పరోక్షంగా చైనాను ఉటంకించారు. అదేవిధంగా లక్సెంబర్గ్‌ విదేశాంగమంత్రి జీన్‌ అస్సెల్‌బోర్న్‌ ప్రశ్నకు బదులిస్తూ, ఆసియాలో నిబంధనల ఆధారిత ఆర్డర్‌ సవాలుగా ఉన్నప్పుడు, ఐరోపా నుంచి మాకు లభించిన సలహా మరింత వాణిజ్యం చేయడమే అంటూ ఎద్దేవా చేశారు.
 కానీ, ఇప్పుడు మేము మీకు ఆ విధమైన సలహా ఇవ్వడంలేదని చెప్పారు. అప్గానిస్తాన్‌లో నిబంధనల ఆధారిత ఆర్డర్‌లో ఏ భాగాన్ని సమర్థించాలో దయజేసి స్పష్టంచేయండి? అంటూ నిలదీశారు. ప్రపంచం అక్కడ ఏం చేసిందో చెప్పండి? అని జైశంకర్‌ ప్రశ్నించారు.
“ఆసియా కూడా ప్రపంచంలో భాగమే. ఇక్కడ సరిహద్దు సమస్యలున్నాయి. దేశాలు మద్దతిస్తున్న ఉగ్రవాదం ఉంది. నియమాల ఆధారిత క్రమం దశాబ్దాలుగా ఒత్తిడిలో ఉంది. ఆసియా వెలుపల ఉన్న ప్రపంచం దీనిని గుర్తించడం అవసరం అని నేను భావిస్తున్నాను” అని జైశంకర్‌ స్పష్టం చేశారు.