అమెరికాపై మరోసారి దాడులకు బిన్ లాడెన్ పన్నాగం!

కట్టుదిట్టమైన భద్రతా వలయాలుండే అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిపి భారీ నష్టం కలిగించడమే కాకుండా, మొత్తం ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఒసామా బిన్ లాడెన్ ఆ తర్వాత మరోసారి అమెరికాపై రెండో భారీ దాడిని చేయాలని ప్రణాళికలు రచించాడని తాజాగా వెల్లడైంది. 9/11 ఉగ్రదాడుల్లో 3 వేలకుపైగా మంది బలవడం తెలిసిందే. 
2011లో బిన్ లాడెన్‌ను యూఎస్ నేవీ సీల్స్ అంతమొందించిన తర్వాత రూపొందించిన డాక్యుమెంట్లు తాజాగా వెలుగుచూశాయి. 9/11 దాడుల తర్వాత అమెరికాపై రెండవ దాడికి ప్యాసింజర్ విమానాలు వినియోగించడం సాధ్యంకాకపోతే, ప్రైవేటు విమానాలను వాడాలని తన అనుచరులకు బిన్ లాడెన్ సందేశమిచ్చాడు. అంతేకాదు యూఎస్ రైల్వే ట్రాకులను 12 మీటర్ల మేర కట్ చేయాలని కుట్రపన్నాడు.
అలాచేస్తే రైలు ప్రమాదంలో వందలాది మంది చనిపోతారని ఉగ్రవాదులకు సలహాఇచ్చాడు.  అల్‌ఖైదా, ఒసామా బిన్ లాడెన్‌‌ల డాక్యుమెంట్లపై అధ్యయనానికి తన జీవితంలో అధిక సమయాన్ని కేటాయించిన రచయిత, ఇస్లామిక్ స్కాలర్ నెల్లీ లహౌడ్ తాజాగా ఈ విషయాలను ఓ అమెరికా మీడియా సంస్థకు చెప్పారు.
9/11 దాడుల తర్వాత అమెరికా యుద్ధానికి దిగుతుందని అల్‌ఖైదా ఊహించలేకపోయింది. భీకర దాడుల తర్వాత అమెరికా ప్రతిస్పందన, ఆప్ఘనిస్తాన్‌లో యుద్ధం చెలరేగడంపై ఉగ్రవాదులే ఆశ్చర్యపోయారని లాడెన్ రాసిన ఓ లేఖ పేర్కొందని లహౌడ్ చెప్పారు.  దాడుల తర్వాత మహా అయితే అమెరికా వీధుల్లో నిరసనలు హోరెత్తుతాయని, ఆప్షనిస్తాన్‌లో ప్రభుత్వం దిగిపోవాలని అమెరికా ఒత్తిడి చేయవచ్చునని లాడెన్ భావించారు. కానీ  అమెరికా స్పందనను లాడెన్ అస్సలు ఊహించలేకపోయారని లహౌడ్ వివరించారు.
 
క్షేత్రస్థాయిలో తన అనుచరులకు బిన్ లాడెన్ రాసిన ఓ లేఖ ప్రకారం.. 9/11 దాడుల తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తన సహాయకులతో లాడెన్ మాట్లాడలేదు. అమెరికా కంటపడకుండా పారిపోయే క్రమంలో ఎవరితోనూ మాట్లాడలేదు. అయితే తిరిగి 2004లో ఉగ్రవాద గ్రూపులతో మళ్లీ మాట్లాడాడు. అమెరికా దాడులకు సంబంధించిన కొత్త ప్లాన్‌ను ఉగ్రవాద గ్రూపులకు వెల్లడించారని లేఖల ద్వారా వెల్లడైంది.