అత్యధికంగా సైన్యం కోసం ఖర్చు చేస్తున్న మూడో దేశం భారత్

కరోనా మహమ్మారితో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయి,  ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ.. పలు దేశాలు సైన్యం కోసం కేటాయించే ఖర్చు మాత్రం రికార్డు స్థాయిలో పెరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. 2021లో అంతర్జాతీయ సైనిక వ్యయం 2.1 ట్రిలియన్‌ డాలర్లతో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుందని స్టాకహేోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ)  వెల్లడించింది.
 
ప్రపంచలో అత్యధికంగా సైన్యం కోసం ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో అమెరికా మొదటిస్థానంలో నిలవగా, చైనా, భారత్‌ ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. 2021లో మొత్తం సైనిక వ్యయం 0.7 శాతం పెరిగి 2113 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, ఈ మొత్తం ఖర్చులో అమెరికా, చైనా, భారత్‌, బ్రిటన్‌, రష్యా దేశాలు 62 శాతం వాటా కలిగి ఉన్నాయని స్టాకహేోం తన నివేదికలో పేర్కొంది. 
 
ఆర్థిక వ్యవస్థలు కుదేలైనా.. సైన్యం కోసం కేటాయించే ఖర్చుమాత్రం రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఎస్‌ఐపిఆర్‌ఐ సీనియర్‌ పరిశోధకులు డా. డియోగో లోప్స్‌ డా సిల్లా తెలిపారు. ద్రవ్యోల్బణం కారణంగా జిడిపిలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ, మిలటరీ కోసం వెచ్చించే వ్యయం మాత్రం 6.1 శాతం పెరిగిందని చెప్పారు. 
 
కరోనా మహమ్మారి నుండి ఆర్థిక పునరుద్ధరణ ఫలితంగా రక్షణ వ్యయం ప్రపంచ జిడిపిలో 2.2 శాతానికి చేరుకోగా, 2020లో ఈ మొత్తం 2.3 శాతానికి చేరుకుంది. స్టాకహేోం నివేదిక ప్రకారం.. 2012- 2021 మధ్య కాలంలో అమెరికా ఆర్మీ, సైనిక పరిశోధన, అభివృద్ధి నిధులను 24 శాతం పెంచిందని, ఆయుధాల కొనుగోళ్లపై 6.4 శాతం ఖర్చు తగ్గించిందని పేర్కొంది.
 
భారత దేశ రక్షణ వ్యయం 76.6 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. 2012 నుండి 33 శాతం పెంచగా, 2020 నుండి 0.9 శాతం పెరిగింది. స్వదేశీ ఆయుధ పరిశ్రమను బలోపేతం చేయడానికి, దేశీయంగా రూపొందించిన ఆయుధాల కొనుగోళ్ల కోసం రక్షణ రంగ బడ్జెట్‌లో 64 శాతం కేటాయించింది.