ధార్మిక పరిషత్‌ సభ్యుల కుదింపుపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధార్మిక పరిషత్‌లో సభ్యుల సంఖ్యను కుదిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని పాలెపు శ్రీనివాసులు అనే వ్యక్తి హైకోర్టులో సవాల్‌ చేశారు. ధార్మిక పరిషత్‌లో 21 మందిని నియమించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు.
సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నలుగురిని నియమించిందంటూ.. పిటిషనర్ తరపున లాయర్ ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. నలుగురిని కూడా అధికారులే నియమించారని ఉమేష్‌ చంద్ర పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను టీటీడీ పిటిషన్‌లతో కలుపుతామని హైకోర్టు పేర్కొంది. ధర్మాసనం ఆదేశాలతో పిటిషనర్ తరపు లాయర్‌ ఉమేష్‌ చంద్ర విభేదించారు.
టీటీడీ పాలకమండలిలో సభ్యుల నియామకాన్ని పెంచి, ధార్మిక పరిషత్‌లో తగ్గించారని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా చేస్తే తీర్పును అమలు చేసినట్టు కాదు కదా అని ప్రశ్నించింది.
అందువల్లే టీటీడీ పిటిషన్‌తో జత చేస్తామని హైకోర్టు పేర్కొంది. టీటీడీ పిటిషన్‌లతో కలిపి విచారించే విధంగా పోస్టింగ్‌ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 22కి హైకోర్టు వాయిదా వేసింది.