వైసిపి పాలనలో 3,000 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు

వైసీపీ వచ్చిన నాటి నుంచి ఏపీలో ఇప్పటివరకు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే రైతుల ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉందని చెబుతూ కన్నీళ్లు తుడవలేని ఈ ప్రభుత్వం దేనికని ప్రశ్నించారు.

శనివారం ఏలూరు జిల్లా చింతలపూడిలో కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పాల్గొంటూ కౌలు రైతుల్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే తాము బయటకు వచ్చామని చెప్పారు. ఈ సభలో చాలామంది వైసీపీ నాయకులున్నారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వారిని గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. 

తొలుత కలపర్రు టోల్‌ప్లాజా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన ర్యాలీగా బయలుదేరారు. జానంపేట, విజయరాయి, ధర్మాజీగూడెం, లింగపాలెం మీదగా చింతలపూడి వరకు ర్యాలీగా వచ్చారు. మధ్యలో కొన్ని గ్రామాల్లో మృతిచెందిన కౌలు రైతుల కుటుంబాలను కలుసుకొని, రూ 1 లక్ష చొప్పున పరిహారం చెక్కులు అందించారు. మొత్తంగా జిల్లాలో 40 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారంగా పవన్‌ అందించారు. 

రైతులు రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చుకుని, చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డారని ఆ కుటుంబాలు చెబుతుంటే గుండె తరుక్కుపోయిందని తెలిపారు. తనను విమర్శించడం మాని, రైతులకు ఏం చేయాలో ఆలోచించాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖను కోరారు. తాను స్క్రీన్  ప్లే రైటర్‌గా కూడా చేయగలనని, వైసీపీ కంటే బాగా డైలాగులు చెప్పగలనని అధికార పార్టీ నాయకులను పవన్‌ హెచ్చరించారు. 

కౌలు రైతులకు 15 మందికి నష్టపరిహారం ఇచ్చామని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారని, అందులోనూ కులవివక్ష చూపిస్తూ ఎస్సీలను వదిలేశారని పవన్‌ విమర్శించారు. జగన్‌లా తనకు రూ.లక్ష కోట్ల ఆస్తి, సిమెంట్‌ ప్యాక్టరీలు లేవు కాబట్టి ఒక్కో రైతుకు రూ.7లక్షలు ఇవ్వలేకపోతున్నానని చెప్పారు.

రాష్ట్రంలో చనిపోయిన 3వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు విడతల వారీగా ఆర్థిక సాయం అందిస్తానని చెబుతూ , అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.7 లక్షలు కూడా వెంటనే ఇవ్వాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.