హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ) ఫ్యాకల్టీ సభ్యురాలు అవమానించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో పోస్టులు పెడుతుండటంతో ఎల్‌పీయూ స్పందించింది. శ్రీరాముడిని అవమానించిన ఫ్యాకల్టీ సభ్యురాలిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు, తాము లౌకికవాదంతో వ్యవహరిస్తున్నట్లు వివరించింది.
ఫ్యాకల్టీ సభ్యురాలు గుర్‌సంగ్ ప్రీత్ కౌర్ విద్యా బోధనలో భాగంగా శ్రీరాముడిని అవమానిస్తూ మాట్లాడినట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎల్‌పీయూ స్పందించింది. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ కౌర్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. తమ విద్యా సంస్థ లౌకికవాదంతో పని చేస్తుందని స్పష్టం చేసింది.
గుర్‌సంగ్ ప్రీత్ కౌర్ ఎల్‌పీయూ విద్యార్థులకు విద్యా బోధనలో భాగంగా మాట్లాడుతూ, ‘‘నిజానికి శ్రీరాముడి మనసు మంచిది కాదు. రాముడు ఎంతమాత్రం మంచి వ్యక్తి కాదు. రావణాసురుడు మంచివాడు. రాముడు జిత్తులమారి అని గుర్తించాను. సీతను చిక్కుల్లో పెట్టడానికి ఆయన ఈ ప్రణాళిక రచించాడు. సీతను ఇబ్బందుల్లోకి నెట్టాడు, రావణుడి మీదకు నిందను తోసేశాడు. ఎవరు మంచివారో, ఎవరు చెడ్డవారో నేను ఎలా నిర్ణయించగలను? ప్రపంచమంతా రాముడిని ఆరాధిస్తోంది, రావణుడు మంచివాడు కాదంటోంది’’ అని ఆమె చెప్పారు. ఈ వీడియో వైరల్ అవడంతో ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
జలంధర్‌లోని ఎల్‌పీయూ స్పందిస్తూ, ఓ ఫ్యాకల్టీ మెంబర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటుండగా చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన కొందరు బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ఆమె వ్యక్తిగతమైనవని స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది.
ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో దేనినీ ఎల్‌పీయూ సమర్థించదని పేర్కొంది. ఇది సెక్యులర్ విశ్వవిద్యాలయమని పేర్కొంది. అన్ని మతాలవారినీ సమానంగా ప్రేమతో, గౌరవంతో చూస్తామని వివరించింది. ఆమెను తక్షణమే అమలయ్యే విధంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది. ఈ మొత్తం సంఘటన పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది.
More Stories
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష