హుబ్లీ అల్లర్ల కేసులో ఏఐఎంఐఎం చీఫ్ అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ నగరంలో ఈ నెల 16వతేదీన జరిగిన అల్లర్లలో మజ్లిస్ (ఏఐఎంఐఎం) పార్టీ హుబ్లీ చీఫ్ దాదాపీర్ బెటగేరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 16న హుబ్లీలో చెలరేగిన హింసాకాండకు సంబంధించి ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు చెందిన నలుగురు నేతలను అరెస్ట్ చేశారు. 
 
ఈ అల్లర్ల కేసులో ఇప్పటివరకు మొత్తం 146 మందిని అరెస్ట్ చేశారు. హుబ్లీలో జరిగిన అల్లర్లతో ఆ ప్రాంతంలో విధించిన 144 సెక్షన్ ను ఉపసంహరించుకున్నారు. మసీదు గురించి సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టు వైరల్ కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ హుబ్లీ ఓల్డ్ టౌన్ పోలీసు స్టేషన్ వెలుపల జనం గుమిగూడారు.
 
దీంతో హింసాకాండ చెలరేగి రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కొందరు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక సర్కారు ప్రకటించింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కార్పొరేటర్ నజీర్ అహ్మద్, కార్పొరేటర్ భర్త ఇర్ఫాన్, సభ్యుడు ఆరిఫ్, మజ్లిస్ పార్టీ హుబ్లీ విభాగం అధ్యక్షుడు దాదాపీర్ లున్నారు.