ఢిల్లీలో నాలుగో వేవ్ ప్రారంభం అనుకోవడం తొందరపాటే!

కరోనా మహమ్మారి నుండి నిదానంగా బయటపడి కోలుకుంటోన్న వేళ మళ్లీ దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కోవిడ్‌ ఫోర్త్‌ వేవ్‌ వచ్చిందేమోనన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

ఢిల్లీలో ఈ వారంలో ఆర్‌ వేల్యూ 2.1 ని దాటిందని ఐఐటి మద్రాస్‌ అంచనా వేసింది. జాతీయ స్థాయిలో ఇది 1.3 మాత్రమేనని తెలిపింది. అయితే ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్‌ మొదలైందన్న అంచనాకు రావడం తొందరపాటేనని ఐఐటి మద్రాస్‌ ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు.

దేశంలో ఒక్క రోజు వ్యవధిలో కొత్తగా 2,527 కరోనా కేసులు వెలుగుచూడటంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 4,30,54,952కు చేరుకున్నాయని కేంద్రం బులిటెన్‌లో శనివారం వెల్లడించింది. అదే సమయంలో, మరో 33 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మరణాలు 5,22,149 కు చేసుకున్నట్లు తెలిపింది. 

24 గంటల వ్యవధిలో కొత్తగా 838 యాక్టివ్‌ కేసులు నిర్థారణ కాగా మొత్తం యాక్టివ్‌ కేసులు 15,079 నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.04 శాతంగా ఉన్నాయని పేర్కొంది.

ఐఐటి మద్రాస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమెటిక్స్‌, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ కంప్యూటేషనల్‌ మేథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ విభాగాధిపతులు ప్రొఫెసర్‌ నీలేశ్‌ ఉపాధ్యారు, ప్రొఫెసర్‌ ఎస్‌.సుందర్‌ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్‌ వేల్యూ 2.1కు చేరుకోవడాన్ని బట్టి ఢిల్లీలో నాలుగో వేవ్‌ మొదలైందన్న అంచనాకు రావడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు.

ప్రొఫెసర్‌ నీలేశ్‌ ఉపాధ్యారు, ప్రొఫెసర్‌ ఎస్‌.సుందర్‌ మాట్లాడుతూ ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో కరోనా కేసులు స్వల్పంగా నమోదవుతుండటంతో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను ఊహించలేమని చెప్పారు. ఢిల్లీలో తాజాగా 1,042 కరోనా కేసులు వెలుగుచూడగా, పాజిటివిటీ రేట్‌ 4.64 శాతంగా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఒక్కో కరోనా బాధితుడి ద్వారా ఇద్దరికి వైరస్‌ వ్యాప్తి చెందుతోందని మాత్రమే ఆర్‌ వేల్యూ ద్వారా చెప్పగలమని తెలిపారు. ప్రజల్లో వ్యాధి నిరోధకత స్థాయిలు, జనవరిలో థర్డ్‌వేవ్‌ సమయంలో కరోనా  వైరస్‌ బారినపడినవారు మళ్లీ వ్యాధికి గురవుతారా ? లేదా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. అందుకే కరోనా  వ్యాప్తి అంచనాకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

27న సీఎంలతో ప్రధాని భేటీ 

ఇలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ సమావేశంలో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.