ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరి

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత మూడు రోజులుగా రెండు వేలకు పైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు రికవరీలకన్నా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి.
 
 శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గురువారం 4.48 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,451 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో పలు ప్రాంతాలలో కరోనా ఆంక్షలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరిగి పోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధిస్తామని కూడా ప్రకటించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని, దీన్ని ఉలఘించిన వారికి రూ.500 జరిమానా విధించడం జరుగుతుందని తెలిపింది. 

అయితే ప్రైవేటు కార్లలో ప్రయాణిస్తున్న వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఢిల్లీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం ఇటీవల మాస్క్ నిబంధనను ఎత్తివేసింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో మళ్లీ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది. పొరుగున ఉన్న నోయిడాలో వందమందికి మాస్క్ పెట్టుకోనందుకు జరిమానాలు విధించారు.

ఓ వైపు బహిరంగ ప్రదేశాల్లో కరోనా నిబంధనలు పాటించడంలో జనం నిర్లక్షంగా వ్యవహరించడం, మరో వైపు మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో తమిళనాడు ప్రభుత్వం కూడా శుక్రవారం మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో కరోనా  ప్రోటోకాల్‌ను పాటించే విషయంలో జనం నిర్లక్షంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ చెప్పారు. 

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారినుంచి జరిమానాను కచ్చితంగా వసూలు చేయాలని ఆరోగ్య శాఖ, పోలీసుతో పాటు సంబంధిత అన్ని శాఖల అధికారులను ఆదేశించినట్లు ఆయన విలేఖరులకు తెలిపారు.