టివి ఛానెళ్ల  ప్రసారాల  తీరుపై కేంద్రం ఆందోళన 

ప్రైవేట్ టెలివిజన్ చానళ్ళ ప్రసారాల తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన  హింసాత్మక సంఘటనలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి చూపించిన కంటెంట్‌ను ప్రస్తావించింది. అనధికారిక, తప్పుదోవ పట్టించే, సంచలనాత్మక, రెచ్చగొట్టే కంటెంట్‌ను ప్రసారం చేయరాదని సూచించింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలలో, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలపై ప్రైవేటు టీవీ చానళ్లు చేసిన ప్రసారాలు ప్రామాణికంగా లేవని పేర్కొంది. ప్రామాణికత లేకుండా, తప్పుదోవపట్టించేవిధంగా, సంచలనం సృష్టించే విధంగా ఈ ప్రసారాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ ప్రసారాల్లో సామాజికంగా ఆమోదయోగ్యం కానటువంటి భాషను, వ్యాఖ్యలను ఉపయోగించినట్లు వ్యాఖ్యానించింది.
సభ్యత, మంచి భావాలకు ఇబ్బందికరంగా ఉన్నట్లు వివరించింది. ఇవి అశ్లీలంగా, అపఖ్యాతి తెచ్చే విధంగా ఉన్నాయని, వీటిలో  మతపరమైన ఘాటు పదజాలం కనిపిస్తోందని పేర్కొంది. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.  హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 16న న్యూఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన హింసాకాండపై ప్రైవేటు టీవీ చానళ్ళ ప్రసారాలను ప్రస్తావించింది.
రెచ్చగొట్టే హెడ్‌లైన్స్, హింసకు సంబంధించిన వీడియోలు పెడుతుండటం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రసారాలు ప్రజల మధ్య మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొడతాయని, శాంతిభద్రతలను, ప్రశాంతతను దెబ్బతీస్తాయని  తెలిపింది.  ఓ వర్గానికి సంబంధించిన తనిఖీ చేయని ఫుటేజ్‌ని ప్రసారం చేస్తూ, దర్యాప్తుకు అంతరాయం కలిగిస్తున్నాయని కేంద్రం ఆరోపించింది. ఇటువంటి ప్రసారాల వల్ల మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది.
కొన్ని చానళ్లు నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాలు, ప్రసారం చేస్తున్న వార్తల్లో సముచితం కానటువంటి, రెచ్చగొట్టే, సమాజం ఆమోదించని భాషను వాడుతున్నారని పేర్కొంది. మతపరమైన వ్యాఖ్యలు, అవమానకరమైన ప్రస్తావనలు చేస్తున్నారని తెలిపింది. ఇటువంటివాటి వల్ల ప్రేక్షకుల మనసులపై వ్యతిరేక ప్రభావం పడుతుందని తెలిపింది. ఫలితంగా మతపరమైన అశాంతికి దారి తీసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
 
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి టీవీ చానళ్ళు ప్రసారం చేస్తున్న తీరును కూడా ప్రభుత్వం ప్రస్తావించింది. చానళ్లు తరచూ తప్పుడు కథనాలను చెప్తున్నాయని, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులను తప్పుగా తరచూ ప్రస్తావిస్తున్నాయని పేర్కొంది. వార్తాంశంతో సంబంధం లేనటువంటి అనుచిత హెడ్‌లైన్స్/ట్యాగ్‌లైన్స్ వాడుతున్నట్లు పేర్కొంది. ప్రేక్షకులను రెచ్చగొట్టేందుకు పాత్రికేయులు, న్యూస్ యాంకర్లు కల్పిత, హైపర్‌బోలిక్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని పేర్కొంది.
నీచమైన భాష, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు, సమాజం అంగీకరించలేని రీతిలో భాషను గుర్తించినట్లు పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కంటెంట్‌ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీని విడుదల చేసింది.

కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్స్‌(నియంత్రణ) చట్టం 1995 ప్రకారం.. 

* కుల, మతాలను రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసారాలు ఉండకూడదు.

* ఇంకొకరి పరువు, ప్రతిష్టలను దెబ్బతినేలా ఉద్దేశపూర్వక వార్తలు వేయకూడదు.

* తొందరపాటులో ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. వాటిని వెంటనే ప్రసారం చేయకూడదు

* తప్పుడు సమాచారం, అశ్లీల కథనాల వార్తలు వద్దు. 

*  జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులపై పుకార్లను ప్రసారం చేయకూడదు

* అసత్యాలను వల్లె వేసి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేయొద్దు

* సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా.. రెచ్చగొట్టేలా పదే పదే ప్రసారం చేయొద్దు

* కథనాలను సగం చెప్పి.. వీక్షకులకు పక్కదారి పట్టించొద్దు.

* వివిధ వర్గాల మనోభావాలను కించపరిచే, దెబ్బతీసే కథనాలు వద్దు.