తమిళనాడులో గవర్నర్‌కే భద్రత లేదు… బీజేపీ ఆగ్రహం

తమిళనాడులో  గవర్నర్‌కే తగిన భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు భద్రత ఎలా ఉంటుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై మండిపడ్డారు. మైలాడుదురై వద్ద గవర్నర్‌ కాన్వాయ్‌పై పథకం ప్రకారం దుండగులు రాళ్ళతో దాడి జరిపారని, నాయకుల ప్రోద్బలం వల్లే ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయని  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు.
ఇందుకు  ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకుంటే పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  రాష్ట్రంలో రోజూ హత్యలు, అత్యాచారాలు అధికమవుతున్నాయని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని దయ్యబట్టారు.
గవర్నర్‌ ప్రాణాలకు ముప్పువాటిల్లే ఇలాంటి సంఘటనను తీవ్రమైనదిగా పరిగణించాలని స్పష్టం చేశా రు. అయితే, గవర్నర్‌పై దాడిని ఖండిస్తూ బీజేపీ ఆందోళనలు జరిపి శాంతి భద్రతలకు భంగం కలిగించదని తెలిపారు. గవర్నర్‌కు భద్రత విషయమై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ  రాసినట్లు చెప్పారు.
 
కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని, సంఘటనపై డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులను సంజాయిషీ కోరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధ్యాత్మిక పర్యటన కోసం మైలాడుదురై వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి నిరసన సెగ తగిలింది. మైలాడుదురైలో ధర్మపుర ఆధీన రథోత్సవ ప్రారంభ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు నల్ల జెండాలతో  నిరసన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా రాష్ట్ర విద్యార్థుల మేలు కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన నీట్‌ ముసాయిదా బిల్లును రాష్ట్రపతికి పంపించకుండా గవర్నర్‌ తన వద్దే అట్టిపెట్టుకున్నారని, ఈ బిల్లుతో పాటు మొత్తం 18 ముసాయిదా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నిరసన తెలిపారు. ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపించాల్సిన గవర్నర్‌ గత రెండు వందల రోజులకు పైగా మూలన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇళయరాజా బిజెపి వ్యక్తి కాదు 
మరోవంక, ఇళయరాజా బీజేపీకి చెందిన వ్యక్తి కాదని, తన సంగీతంతో ప్రజల మనసులను దోచుకున్న వ్యక్తి అని  అన్నామలై కొనియాడారు.  అంబేడ్కర్‌ని ప్రధాని మోదీతో పోల్చి ఓ పుస్తకానికి సంబంధించి ముందుమాటలో ఇళయరాజా ప్రశంసించడం తప్పుకాదని స్పష్టం చేశారు.  బీజేపీకి  ఆయనకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు.
ఈ విషయంలో డీఎంకే ఐటీ విభాగం ఇళయరాజా కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా విమర్శలు చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయబోతున్నారని వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ,  ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కంటే ఆయను ‘భారతరత్న’తో సత్కరించడమే సముచితంగా ఉంంటుందని ఆయన సూచించారు.