ప్రత్యేక నిబంధనలతో ప్రార్థనా స్థలాల్లో మైకులు

మత పరమైన విధానాలకు అనుగుణంగా ఆరాధనా పద్ధతులను అనుసరించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అయితే, నిర్ధారించిన ప్రాంతాల్లో మాత్రమే మతపరమైన కార్యక్రమాలు, ఆరాధనలు జరుపుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని హెచ్చరించారు. 
 
ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం రేగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రార్థనా స్థలాల్లో మైకులు వాడవచ్చని, అయితే మైకుల శబ్దం మాత్రం ఆ ఆవరణ దాటి బయటకు పోరాదని స్పష్టం చేశారు. ఇతరులకు ఎలాంటి సమస్య ఉండకూడదని చెప్పారు. మైక్‌ల ఏర్పాటుకు కొత్తగా అనుమతులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
 
రాబోయే పండుగల్లో శాంతికి భంగం కలుగకుండా ఉండేలా రాబోయే 24 గంటల్లో మతపరమైన నాయకులు, ప్రముఖులతో సంప్రదింపులు జరపాలని పోలీసు ఉన్నతాధికారులను యోగి ఆదేశించారు. ”అనుమతి లేకుండా ఎలాంటి ఊరేగింపులు తీయరాదు. శాంతి, సామరస్యాలను కాపాడతామంటూ ఆర్గనైజర్ల నుంచి అఫిడవిట్ తీసుకోవాలి” ఆయన సూచించారు. 
 
సంప్రదాయబద్ధంగా జరిగే మతపరమైన ఊరేగింపులకే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాల్సిన పనిలేదని అధికారులను యోగి ఆదేశించారు. యూపీలోని ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వానిదని భరోసా ఇస్తూ, ప్రజలు సైతం ఇది తమ బాధ్యతగా గుర్తించాలనిఆయన  సూచించారు. వాతావరణాన్ని కలుషితం చేసేందుకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  నాగరిక సమాజంలో అలాంటి వారికి చోటులేదని యోగి స్పష్టం చేశారు. 

63 బంగ్లా శరణార్ధ కుటుంబాలకు ఆవాస పత్రాలు 

కాగా, బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన 63 హిందూ కుటుంబాలకు యోగి ఆదిత్యనాథ్ రెసిడెన్సియల్, వ్యవసాయ భూముల పత్రాలను మంగళవారం అందజేశారు. అధికారిక పత్రాలతో పాటు, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద లక్నోలో ఇళ్లు కట్టించి ఇస్తామనే లేఖలను కూడా సీఎం అందించారు.
 
బంగ్లా శరణార్థ హిందూ కుటుంబాలకు ఆవాస, వ్యవసాయ భూములు కేటాయిస్తామని గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. భూ ఆక్రమణలదారుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌గా ఏర్పాటు చేస్తామని, ఈ భూములను పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు, బంగ్లా శరణార్ధ హిందూ కుటుంబాల ఆవాసాలకు ఉపయోగిస్తామని తెలిపారు.