జహంగీర్‌పురి ఘర్షణల్లో తమ పేరు .. వీహెచ్‌పీ ఆగ్రహం

జహంగీర్‌పురి ఘర్షణల సందర్భంగా తాము పోలీస్ అనుమతి లేకుండానే హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర జరిపినట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం పట్ల విశ్వహిందూ పరిషద్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  తమతో పాటు,  భజరంగ్ దళ్‌పై కేసు నమోదు చేయవలసిందిగా “లౌకిక, ముస్లిం నాయకుల” నుండి ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి వస్తుందని ఆరోపించింది. 
 
ఆ ప్రాంతం గుండా శోభాయాత్ర చేపట్టేందుకు అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్  రాకేష్ అస్థానా చేసిన ప్రకటన “నిరాధారం” అని స్పష్టం చేసింది. ఊరేగింపులకు ఢిల్లీ పోలీసులు ఎవరికీ అనుమతి ఇవ్వరని చెబుతూ ఒక నిర్దిష్ట ఊరేగింపును బయటకు తీయకూడదని వారు భావిస్తే, దానిని రద్దు చేయమని సంబంధిత సంస్థకు లేఖ మాత్రం వ్రాస్తుంటారని పేర్కొన్నది. 
 
ఏప్రిల్ 17న షహదారాలో జరిగే శోభా యాత్రను రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు తమకు అలాంటి లేఖను పంపారని, తాము  దానికి కట్టుబడి ఉన్నామని గుర్తు చేసింది. లౌకిక, ముస్లిం నేతల ఒత్తిడికి గురికావద్దని ఢిల్లీ సీపీకి   వీహెచ్‌పీ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర గుప్తా హితవు చెప్పారు. 
 
శనివారం నాడు జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపులో జరిగిన మత ఘర్షణల తరువాత తొమ్మిది మంది గాయపడ్డారు, ఢిల్లీ పోలీసులు రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.  వాటిలో ఒకటి అనుమతి లేకుండా ఊరేగింపు జరిపినందుకు వీహెచ్‌పి, బజరంగ్ దళ్,  వారి ఆఫీస్ బేరర్‌లపై కేసు నమోదు చేశారు. 
 
ఈ సంఘటన తర్వాత తాను అస్థానాను ఎలా కలిశానో, “సున్నిత ప్రాంతాల” గుండా ఊరేగింపును తీసుకువెళ్లడం గురించి చివరికి ఎలా ఒప్పించబడ్డాడో గుప్తా వివరించారు. “ఏప్రిల్ 17న మేము ఢిల్లీ సీపీని కలవడానికి వెళ్ళాము. ఒక నిర్దిష్ట ప్రాంతం సున్నితమైందని, దాని గుండా మీరు ఊరేగింపులు చేయకూడదని నేను మీకు చెప్పినా మీరు మా మాట వినడం లేదని ఆయన మాకు చెప్పారు. దీంతో ఢిల్లీ మొత్తం సెన్సిటివ్‌గా మారుతుందని ఆయనకు చెప్పాల్సి వచ్చింది” అని తెలిపారు. 
 
“మనం ఢిల్లీని హిందూ, ముస్లిం ప్రాంతాలుగా విభజించబోతున్నట్లయితే, రేపు ముస్లింలు తజియా ఊరేగింపులు జరిపినప్పుడు, అది హిందూ ప్రాంతాలను దాటకూడదని మనం చెప్పబోతున్నామా? ఆయన  అర్థం చేసుకొని తన వైఖరి మార్చుకున్నారు” అని గుప్తా చెప్పారు. అయితే ఢిల్లీ పాలనా యంత్రాంగం,  పోలీసులు ఈ సంఘటన గురించి చాలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఏప్రిల్ 15న, శోభా యాత్రను (ప్రాంతాలు) చేపట్టాలని మేము రెండు పోలీసు స్టేషన్‌లకు లిఖితపూర్వకంగా తెలియజేసాము. నగరంలో ఇలాంటి 20 ఊరేగింపుల గురించి పోలీసు ప్రధాన కార్యాలయానికి కూడా సమాచారం పంపాము. ఈ ఊరేగింపులలో దేనినీ వారు రద్దు చేసినట్లు ఢిల్లీ పోలీసులు మాకు తెలియజేయలేదు” అని స్పష్టం చేశారు.జహంగీర్‌పురి శోభా యాత్రలో పాల్గొన్న 1,000 మందికి రక్షణ కోసం పోలీసులు కేవలం ముగ్గురు పోలీసులను మాత్రమే అందించారని గుప్తా ఆరోపించారు.

కాగా, బెంగాలీ, రోహింగ్యా ముస్లింలతో కలిసి ఊరేగింపుపై దాడికి కుట్ర పన్నినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడిని కూడా ఆయన ఈ సందర్భంగా తప్పుపట్టారు. ఇది కుట్ర అని ఢిల్లీ పోలీసులు తమ  ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. 

 
వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌పై తప్పుడు కేసులు బనాయించాల్సి వచ్చినా హిందూ సమాజం, దేశ ప్రయోజనాలను కాపాడడం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ”హిందూ పండుగలను జరుపుకునే రాజ్యాంగం కల్పించిన మా హక్కును మీరు హరించలేరు. జిహాదీ దాడుల నుంచి ఢిల్లీని విముక్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. మేము మా లక్ష్యాన్ని చేరుకుంటాము” అని గుప్తా స్పష్టం చేశారు. 
 
 మరోవంక, “ఈ దాడి సూత్రధారి అన్సార్, ఆప్ కార్యకర్త అని తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఫోటోల రూపంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్లకు సూత్రధారి అయిన తాహిర్ హుస్సేన్ కూడా ఆప్  కౌన్సిలర్. ఆప్ అల్లర్ల ఫ్యాక్టరీని నడుపుతుందా?” అని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రశ్నించారు.

ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాస్తూ, “యువకుడు, స్పష్టంగా ఆప్ కార్యకర్త ప్రమేయంపై ఆప్ నాయకత్వం నుండి ప్రజలు సమాధానం కోరుకుంటున్నారు…” అని పేర్కొన్నారు.