ఆత్మహత్యలపై బీజేపీకి గవర్నర్ కు ఫిర్యాదు 

రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలే అంటూ ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ను బీజేపీ నేతలు కోరారు. ఆత్మహత్యలపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. 
 
మంత్రులు, పోలీసుల ముద్దాయిలుగా ఉన్న నేపథ్యంలో బాధితులకు అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వనమా కొడకు, నిర్మల్ ఘర్షణలపై విచారణ జరపాలని వారు కోరారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని తెలిపారు. అయితే బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. 
 
మంత్రులు, పోలీసులే ముద్దాయిలుగా ఉన్నారంటూ బిజెపి ఎమ్యెల్యే ఎన్  రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పధకం ప్రకారమే టి ఆర్ ఎస్ నేతలు బీజేపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని మాజీ ఎమ్యెల్సీ ఎన్  రామచంద్రరావు ఆరోపించారు. 
 
ఖమ్మం ఆత్మహత్య ఘటనలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం, కామారెడ్డి ఘటనలలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం ఘటనపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాకపోవడం దారుణమని విమర్శించారు. 
 
ఖమ్మం, రామాయంపేట బాధిత కుటుంబాలకు.. న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరామని చెబుతూ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి అజయ్‌ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని పొంగులేటి హెచ్చరించారు. 

కేపీహెచ్బీ పీఎస్ ముందు బీజేపీ నేతల ఆందోళన

కాగా, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కోర్డినేటర్ సతీష్ అరోరాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ  కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ ముందు బిజెపి నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  మేడ్చల్ మల్కాజ్ గిరి అర్భన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, ఇతర నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
స్టేషన్ కు ముందు ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.  సతీష్ అరోరాను అరెస్ట్ చేసి చర్యలు తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బీజేపీ నేతలు అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని పంపించేందుకు యత్నించారు. 
పోలీసులు, బీజేపీ నేతల మధ్య ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నేతలను చొక్కాలను పట్టి లాగడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు చేయి చేసుకున్నారని మండిపడ్డారు.