బోరిస్‌ జాన్సన్‌తో సహా 13మంది ప్రముఖులపై రష్యా నిషేధం

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో సహా 13మంది ఉన్నతాధికారులు రష్యాలోకి ప్రవేశించకుండా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. రష్యాను అంతర్జాతీయంగా ఏకాకిని చేయడానికి బ్రిటన్‌ చేస్తున్న ప్రయత్నాలకు, అడ్డూ అదుపు లేకుండా చేస్తున్న తప్పుడు, రాజకీయ ప్రచారానికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. 

రష్యాను అదుపు చేయడానికి, రష్యా ఆర్థిక వ్యవస్థను చిక్కుల్లో పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన వారిలో బ్రిటీష్‌ డిప్యూటీ ప్రధాని, న్యాయ శాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, రక్షణమంత్రి బెన్‌ వాలెస్‌ ఉన్నారు. 

రష్యా వ్యతిరేక విధానానిు అనుసరించే మరింతమంది రాజకీయ నేతలను, పార్లమెంట్‌ సభ్యులను సమీప భవిష్యత్తులో ఈ జాబితాలో చేర్చనున్నట్లు రష్యా ప్రకటన పేర్కొంది.

తిరిగి వచ్చిన బ్రిటన్ కమాండోలు 

మరోవంక, రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత మొదటిసారిగా ఉక్రెయిన్‌ బలగాలకు బ్రిటీష్‌ సాస్‌ దళాలు శిక్షణ ఇస్తున్నాయని ఉక్రెయిన్‌ కమాండర్లు తెలిపారు. తొలుత రెండు మాసాల క్రితం బ్రిటన్‌ నుండి వచ్చిన ఇనస్ట్రక్టర్లు దాడుల భయంతో ఉక్రెయిన్‌ విడిచివెళ్లిపోయారు. 

 కానీ ఇప్పుడు వారు తిరిగి వచ్చారని ఉక్రెయిన్‌ అధికారులు చెప్పారు. బ్రిటన్‌ సరఫరా చేసిన ట్యాంక్‌ విధ్వంసక క్షిపణి లాంచర్లను, ఎన్‌లాస్‌ను ఎలా ఉపయోగించాలో స్థానికులకు నేర్పేందుకువీరు తిరిగి వచ్చారని ఉక్రెయిన్‌ కమాండర్లను ఉటంకిస్తూ ది టైమ్స్‌ పత్రిక వివరించింది. 

రాజధానికీవ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గల యూనిట్లకే ఈ శిక్షణ అందుతోందని ఆ పత్రిక వార్తా కథనం వెల్లడించింది. బ్రిటన్‌ రక్షణ శాఖ ఈ వార్తలను నిర్ధారించడానికి తిరస్కరించింది. శిక్షణ కోసం కొంతమంది ఉక్రెయిన్‌ సైనికులు ఈ వారంలో బ్రిటన్‌ వస్తారని సాయుధ బలగాల మంత్రి జేమ్స్‌ హీపే తెలిపారు.

కాగా, ఉక్రెయిన్‌కు కొత్త, భారీ ఆయుధాలను సరఫరా చేయాలను నాటో ప్రణాళికలను శాంతి ఉద్యమ కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బ్రిటన్‌వ్యాప్తంగా మరిన్ని నిరసనలు, ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని వారు భావిస్తున్నారు.  స్టాప్‌ ది వార్‌ కొయిలేషన్‌ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. ఉక్రెయిన్‌కు అవసరమైన సైనిక పరికరాలను అందజేస్తామని నాటో ప్రకటించిన నేపథ్యంలో బ్రిటన్‌వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరిగాయి.

రష్యా ఇంధన సంస్థలపై ఇయు నిషేధం విధించినట్లైతే ఫ్రాన్స్‌కు జరిగే నష్టాన్ని అమెరికా భర్తీ చేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్ష అభ్యర్థి మారినె లీ పెన్‌ స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలు విధించాల్సిందిగా ఇయుపై అమెరికా ఒత్తిడి తెస్తోందని ఫ్రాన్స్‌ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ ఆరోపణ చేశారు.