5 శాతం జిఎస్‌టి శ్లాబ్‌ను రద్దు!

వచ్చే నెలలో జరుగనున్న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో జిఎస్‌టి నిబంధనల్లో పలు మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది. 5 శాతం పన్ను శ్లాబ్‌ను రద్దు చేయాలనే ప్రతిపాదనను సమావేశంలో చర్చించే అవకాశముంది. అధిక వినియోగ ఉత్పత్తులను 3 శాతం శ్లాబ్‌లో, మిగిలిన వాటిని 8 శాతం శ్లాబ్‌లో చేర్చనున్నారు. 

దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో పాటు పరిహారం కోసం ఇతర రాష్ట్రాలు కేంద్రంపై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదు. ప్రస్తుతం జిఎస్‌టిలో నాలుగు శ్లాబ్‌లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ఉన్నాయి. 

నిత్యావసర వస్తువులు కనిష్ట శ్లాబ్‌లో ఉంటాయి. అయితే లగ్జరీ, డీమెరిట్ వస్తువులు అధిక పన్ను శ్లాబ్ ఉంటుంది లగ్జరీ, ఇతర గూడ్స్‌పై 28 శాతం శ్లాబ్ కంటే అత్యధిక సెస్సును విధిస్తారు.

జిఎస్‌టి అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి దీనిపై పన్ను వసూలు ఉపయోగించబడుతుంది. అదనంగా బంగారం, ఆభరణాలపై 3 శాతం పన్ను ఉంటుంది. అదే సమయంలో అన్‌బ్రాండెడ్, ప్యాక్ చేయని ఆహార పదార్థాలు, పాల వస్తువులు జిఎస్‌టి పరిధిలోకి రావు. 

ఆదాయాన్ని పెంచుకోవడానికి కౌన్సిల్ కొన్ని ఆహారేతర వస్తువులను మినహాయింపు ఇవ్వగా, వాటిపై 3 శాతం శ్లాబ్ విధించే అవకాశముంది. 5 శాతం శ్లాబ్‌ను 7, 8, 9 శాతానికి పెంచడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే తుది నిర్ణయం జిఎస్‌టి కౌన్సిల్ తీసుకుంటుంది.

ఈ సమావేశంలో కేంద్రం, రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు పాల్గొంటారు. పన్ను శ్లాబ్‌ను 5 శాతం నుంచి 8 శాతానికి పెంచడం ద్వారా ఏడాదికి రూ.1.50 లక్షల కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అంటున్నారు.