ఈడీ రూ 757 కోట్ల ఆమ్‌వే ఆస్తుల జప్తు

ప్రముఖ మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఆమ్‌వేకు చెందిన రూ.757 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా ఈడీ జప్తు చేసింది. ఆస్తులతో పాటు ఫ్యాక్టరీలకు సంబంధించిన స్థలాలను కూడా జప్తు చేసింది. రూ.411 కోట్ల ఆస్తులు, రూ.345 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఫ్రీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్‌వే సంస్థ 36 అకౌంట్లను ఈడీ ఫ్రీజ్ చేసింది.
 
తమిళనాడులోని దిందిగల్‌ జిల్లాలో ఉన్న ఫ్యాక్టరీ, లాండ్‌, ఫ్లాంట్‌, యంత్రాలు, వాహనాలు, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను జప్తు చేసినట్లు ఇడి పేర్కొంది. రూ. 411.83 కోట్ల స్థిర, చర ఆస్తులతో పాటు ఆమ్వేకు చెందిన 36 ఖాతాలో ఉన్న రూ.345.94 కోట్లను తాత్కాలికంగా ఎటాచ్‌ చేసినట్లు తెలిపింది.
 
 మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ ముసుగులో మోసాలకు పాల్పడుతున్నట్లు మనీలాండరింగ్‌ దర్యాప్తులో తేలిందని పేర్కొంది. ఈ సంస్థ అందిస్తున్న ఉత్పత్తులన్నీ కూడా రెగ్యులర్‌ మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీల ఉత్పత్తుల కంటే అధిక ధరతో ఉండటం, భాగస్వాములకు అధిక మొత్తంలో కమిషన్లు అందివ్వడం తదితర ఆరోపణలపై ఇడి ఆస్తులు అటాచ్‌ చేసింది.
 
ఆమ్‌వే రూ.27,562 కోట్ల వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది. కమిషన్ రూపంలో రూ.7,588 కోట్ల చెల్లింపులు జరిగినట్లు వెల్లడించారు. అమెరికా, భారత్ లలో ఉన్న సభ్యులకు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. 
 
అమెరికాకు చెందిన బ్రిట్ వరల్డ్‌వైడ్, నెట్‌వర్క్ 21లో ఆమ్‌వే షేర్లు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఆమ్‌వేపై మొదటిసారి సీఐడీ విచారణ జరిపింది. ఆమ్‌వే సీఈవోను కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.