పోలీసుల వేధింపులతో ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య

 పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారనే కారణంతో బీజేపీ మజ్దూర్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయి గణేశ్ పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పట్టణంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయి గణేశ్ ఈ ఘటనకు పాల్పడ్డాడు. 
 
మంత్రి పువ్వాడ అజయ్, స్థానిక టీఆర్ఎస్ నేతలు, సీఐ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని సాయి గణేశ్ ఆరోపించాడు. అతడిని వెంటనే స్థానిక హాస్పిటల్ లో చేర్చినా  పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. 
 
కాగా.. చికిత్స పొందుతూ సాయి గణేశ్ ఈ రోజు మృతి చెందాడు. శవపరీక్ష కోసం గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా బీజేపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రిలో పోలీసులు భారీగా మోహరించారుఅధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లే పోలీసులు సాయి గణేష్ పై అక్రమ కేసులు పెట్టారని, దీనిలో భాగంగానే  ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
 సాయి గణేశ్ మృతి పట్ల బీజేపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. అతడి మృతికి టీఆర్ఎస్ నాయకులే కారణమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆరోపించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
 
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండతోనే అక్రమ కేసులు పెడుతున్నారని  ధర్మపురి అర్వింద్‌ విమర్శలు గుప్పించారు. సాయి గణేష్‌ను మంత్రి పువ్వాడ, పోలీసులు వేధించారని ఆయన ఆరోపించారు. జిల్లాలో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ అర్వింద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమలం పార్టీ ఎదుగుదలను నిలువరించే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం మరో హత్య చేసిందని అర్వింద్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నందునే సాయి గణేష్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని… మంత్రి పువ్వాడ అజయ్ అండతోనే రౌడీషీట్ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఆ కారణంగానే మనస్తాపానికి గురై సాయి గణేశ్ మూడ్రోజుల క్రితం ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేశారు.
కాగా, మజ్దూర్ సంఘ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయిగణేష్‌పై పీడీయాక్ట్ పెట్టి వేధింపులకు గురిచేయడం వల్లనే చనిపోయాడని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నాడు కాబట్టే సాయిగణేష్ పై పీడీయాక్ట్ పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 16 కేసులు పెట్టిందని పేర్కొన్నారు. అవినీతి మంత్రి పువ్వాడను సాయి గణేష్‌ ప్రశ్నించాడని, అందుకే అతడిపై కేసులు నమోదయ్యాయని ధ్వజమెత్తారు. .మంత్రి పువ్వాడ వేధింపులే గణేష్‌ మృతికి కారణమని స్పష్టం చేశారు. 
 
ఈ సంఘటనతో ఖమ్మం పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి అజయ్‌ కుమార్‌ కార్యాలయం, జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి కార్యాలయం నాలుగు వైపులా భారీ గేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు.
 
కాగా వచ్చే నెల 4వ తేదీన సాయి గణేష్ వివాహం జరగనుంది. ఇంతలోనే ఇలా జరగటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే సాయి గణేష్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధించారని బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగానని తమతో సాయి గణేష్ చెప్పాడనీ బంధువులు చెబుతున్నారు.