కేసీఆర్​ పీఠం కదులుతున్నది.. ప్రజల తిరుగుబాటు మొదలు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ పీఠం కదులుతున్నదని, ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్​ పోవుడు, బీజేపీ వచ్చుడు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ మీద నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి గద్వాల జిల్లా లింగనవాయి గ్రామం దగ్గర పాల్గొంటూ ‘‘బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతమని, నరేంద్ర మోదీని దేశం నుంచి తరిమి కొడ్తమని కేసీఆర్​ అంటున్నరు. బీజేపీని ఢీ కొట్టడానికి నువ్వెంత.. నీ కుటుంబం ఎంత?” అని మండిపడ్డారు.

‘‘దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. యూపీలో నాలుగుసార్లు, గోవాలో మూడోసారి, ఉత్తరాఖండ్, మణిపూర్ లో రెండోసారి అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం” అని స్పష్టం చేశారు.

కేసీఆర్​ ఎంత గాయి చేసినా, అసదుద్దీన్  ఒవైసీ కాళ్లు పైకి తల కిందికి పెట్టి ప్రచారం చేసినా వచ్చే ఎన్నికల్లో దేశ ప్రధానిగా మరోసారిమోదీ ఎన్నిక కావడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసీఆర్​ పాలనలో రాష్ట్రంలోని  అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రజల్లో  వ్యతిరేకత మొదలైందని, పిడికిలి బిగించి టీఆర్ఎస్ పై ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, డ్రగ్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని కేంద్ర మంత్రి మండిపడ్డారు. జాతీయ రహదారులు తప్ప రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ బాగా లేవని, కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులు వేస్తుంటే ఆ రోడ్ల వెంబడి టీఆర్ఎస్ నాయకులూ భూదందాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రపంచంలోనే సెక్రటరియేట్ లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కిషన్​రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ఆరోగ్యం కోసం రూ 5 లక్షలు ఖర్చు పెడుతుంటే రాష్ట్రంలో మాత్రం ఆ స్కీం అందకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ఎక్కడ బీజేపీకి, నరేంద్రమోదీకి పేరు వస్తుందోనని తెలంగాణ ప్రజలకు ఆయుష్మాన్ భారత్​ కార్డు అందకుండా అడ్డుకుంటున్న నీచ చరిత్ర కేసీఆర్ దేనని దుయ్యబట్టారు. ​ఇంద్ర భవనం లాంటి ఫాంహౌస్ ను 4 నెలల్లో కట్టించుకున్న కేసీఆర్​ ఇన్నేండ్లుగా నిరుపేదలకు ఎందుకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించలేకపోయారని కిషన్​రెడ్డి నిలదీశారు.

కేసీఆర్​ మాటలు కోటలు దాటుతాయి గానీ చేతలు ఫామ్ హౌస్​ను కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్​ను ఓడించటానికి వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ జెండా ఎగిరిందని గుర్తు చేశారు.  ఇదే పరిస్థితి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని చెప్పారు.

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెబుతూ వచ్చే బీజేపీ ప్రభుత్వంలో వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ, అరాచక పాలనకు చరమగీతం పాడి, అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొస్తామని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లాను కేసీఆర్​ దత్తత తీసుకొని దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కృష్ణా, తుంగభద్ర నదులు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎడారిగా మారిందని చెబుతూ ఈ ప్రాంతాన్ని  అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.