ప్రతిపక్షాల నిరసనపై సీఎం బొమ్మై ఆగ్రహం

ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య నేపథ్యంలో మంత్రి కేఎస్ ఈశ్వరప్ప నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా  నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తున్న కాంగ్రెస్ తీరును కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు అధికారిగా కానీ, న్యాయమూర్తిగా కానీ ప్రతిపక్షాలు ఉండవలసిన అవసరం లేదని హితవు చెప్పారు. 

బసవరాజ్ బొమ్మయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈశ్వరప్ప తనంతట తానే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని,  దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ప్రతిపక్షాలు ఓ దర్యాప్తు అధికారిగానో, ఓ జడ్జిగానో ఉండవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే మంత్రి ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేసినంత మాత్రానికి సరిపోదని, రాజీనామా చేయడం సమస్యకు పరిష్కారం కాదని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం క్రింద కేసు నమోదు చేసి, ఆయనను అరెస్టు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు  శివ కుమార్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ సంతోష్‌ను 40 శాతం కమిషన్ చెల్లించాలంటూ వేధించారని ఆయన తల్లి, భార్య, సోదరుడు ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈశ్వరప్పపై కేసు నమోదు చేయాలనేది తన డిమాండ్ కాదని, ఇది కర్ణాటక గళమని చెప్పారు. 

ఈశ్వరప్ప శుక్రవారం సీఎం బసవరాజ్‌ బొమ్మైని కలిసి రాజీనామా లేఖను అందజేశారు. అంతకు ముందు  తన సొంతూరు శివమొగ్గలో మాట్లాడుతూ.. పార్టీ నేతలను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తాను నిర్ధోషి అని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చాడు. అప్పటి వరకు మంత్రి పదవికి దూరంగానే ఉంటానని తేల్చి చెప్పాడు. 

సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు తనకు ఫోన్‌ చేసిన మద్దతుగా నిలిచారని సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుడు ఎవరూ తప్పు చేయరనే నమ్మకాన్ని తనకు తెలియజేశారని తెలిపారు. కాగా, తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలక ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటకు వస్తానని, అనంతరం మళ్లీ మంత్రి పదవి చేపడతానని తన మద్దతుదారులకు పార్టీ కార్యకర్తలకు ఈశ్వరప్ప భరోసా ఇచ్చారు.

 తన మద్దతుదారులను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈశ్వరప్ప మాట్లాడుతూ ‘‘నాపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. దాన్నుండి నేను నిర్దోషిగా బయటపతాను. అయితే విచారణ జరుగుతున్న సమయంలో మంత్రిగా కొనసాగితే దర్యాప్తుపై ప్రభావం పడుతుందనే భావనతో రాజీనామా చేశాను. నిర్దోషిగా బయటకు వస్తా. మరోసారి మంత్రి అవుతా’’ అని స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా,  తన పాత స్నేహితుడు ఈశ్వరప్పపై వచ్చిన ఆరోపణలు అన్నికొట్టుకుపోయి ఆయన నిజాయితీ వెలుగులోకి వస్తుందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి  బిఎస్ యడ్యూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విమర్శలు ఫిర్యాదుల నుంచి త్వరలోనే ఆయన విముక్తుడు అవుతారని, తిరిగి రాష్ట్ర మంత్రిగా వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈశ్వరప్పతో తన స్నేహం పురాతనమైనది. ఆయన నైజం ఏమిటనేది తనకు తెలుసునని నిర్దోషిగా తిరిగి వెలుగొందుతాడని స్పష్టం చేశారు.