కవ్వింపు చర్యలకు పాల్పడితే భారత్ సింగమే …. రాజనాథ్ 

భారత్ శాంతి కపోతంగా ఉంటుందని,  అయితే కవ్వింపు చర్యలకు పాల్పడే వారి పట్ల సింగం అవుతుందనిరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. హానీ కల్గిస్తే గాయపరిస్తే భారత్ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు.  

చైనా చర్యలను పరోక్షంగా దృష్టిలో పెట్టుకుని అమెరికా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్యలకు దిగారు.  2 ప్లస్ 2 మంత్రుల స్థాయి భేటీలో భాగంగా అమెరికా రక్షణ మంత్రితో కీలక భద్రతా విషయాలను సమీక్షించారు. ఇదే దశలో ఆయన  శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ సంతతి వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఇతర దేశాలతో భారత సంబంధాలు నిర్థిష్టంగా ఉంటాయని తెలిపారు. 

స్పష్టత ఉండనే ఉంటుందని తేల్చిచెప్పారు. ఒక్క దేశంతో సంబంధాలు నెరిపే క్రమంలో వేరే దేశంతో తెగతెంపుల ప్రసక్తి ఉండదని, ఇదే ప్రధాని నరేంద్ర మోదీ  సారథ్యపు కేంద్ర ప్రభుత్వ పాలసీ అని అమెరికాను దృష్టిలో పెట్టుకుని తెలిపారు. 

ఎక్కువ తక్కువల అంచనాలతో భారతదేశ విధానాలు ఖరారు కాలేదని, దేశీయ ప్రయోజనాల కోణంలోనే అన్ని అంశాల ప్రస్తావన ఉంటుందని పేర్కొన్నారు. జీరో సమ్ గేమ్ డిప్లోమసీ తమ దేశానికి నచ్చదని తేల్చిచెప్పారు. 

ఇక్కడి ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో రాజ్‌నాథ్‌కు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. చైనా సరిహద్దులలో భారతీయ జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎనలేనివని కొనియాడారు. భారత్ ఎవరికి తలవంచదని, అయితే ఎవరైనా చికాకు కల్గిస్తే చూస్తూ సహించదని హెచ్చరించారు.  దెబ్బకు దెబ్బ విధానం పాటిస్తుందని స్పష్టం చేశారు. గల్వాన్ వ్యాలీలో చైనా ఘర్షణల తంతును రక్షణ మంత్రి ప్రస్తావించారు.