మత మార్పిడులపై అప్రమత్తం… గోవా సీఎం హెచ్చరిక

మత మార్పిడులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు. కుడ్నెమ్ దేవాలయ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, మరోసారి మతం దాడికి గురవుతోందని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పడం లేదని పేర్కొన్నారు. 
 
గోవాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు మత మార్పిడులవైపు వెళ్తున్నట్లు మనం గమనిస్తున్నామని తెలిపారు.  పేదరికం,  అల్ప సంఖ్యాకులుగా ఉండటం, వెనుకబడిన తనం, ఆహారం కొరత, ఉద్యోగాలు లేకపోవడం వంటి కారణాలతో చాలా మంది మతమార్పిడికి గురవుతున్నారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మత మార్పిడులు జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మత మార్పిడులను ప్రభుత్వం అనుమతించదని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లోని దేవాలయ ట్రస్టులు అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అరవయ్యేళ్ళ క్రితం పోర్చుగీసు పాలనలో ఉన్న గోవాలో భగవంతుడు, మతం, దేశం అనే సెంటిమెంట్‌తో ముందుకు వెళ్ళామని గుర్తు చేశారు. మన దేవుడు సురక్షితంగా ఉంటే, మన మతం సురక్షితంగా ఉంటుందని, మన మతం సురక్షితంగా ఉంటే, మన దేశం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.
అందుకే ప్రజలు తమ దేవతలతో కలిసి గోవా నుంచి వెళ్ళిపోయారని చెప్పారు. కానీ గడచిన అరవయ్యేళ్ళలో చాలా కుటుంబాలు తిరిగి తమ స్వస్థలాలకు వచ్చి, తమ కుల దేవతలను ఆరాధించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. ఆ కుటుంబాలు పోర్చుగీసు పాలనలో ధ్వంసమైన తమ దైవాన్ని, సంస్కృతిని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
పోర్చుగీసు పాలనలో ధ్వంసమైన దేవాలయాల పునరుద్ధరణ కోసం రూ.20 కోట్లు కేటాయిస్తున్నట్లు మార్చి 31న గోవా బడ్జెట్ ప్రసంగంలో సావంత్ ప్రకటించారు.