రష్యా రక్షణమంత్రికి అనుమానాస్పదంగా తీవ్ర గుండెపోటు ?

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మూడవ నెలలోకి ప్రవేశించింది. భీకర పోరులో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో  రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షోయిగు గత పలు వారాలుగా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. 
 
ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ గుండెపోటు సాధారణ కారణాల వల్ల రాలేదని చెబుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల్లో 20 మంది జనరల్స్  అరెస్ట్ అయ్యారనే వార్తల నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూడడం గమనార్హం. 
 
ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధంలో ఆశించిన విధంగా రష్యా సేనలు విజయాలు సాధించాక పోవడంతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అసహనంతో ఉన్నారని, ఈ విషయమై రక్షణమంత్రి, పలువురు సైనికాధికారులతో ఆయనకు తీవ్రమైన విబేధాలు తలెత్తాయని విదేశీ మీడియా పలు కథనాలను వ్యాప్తి చేస్తుంది.
 
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కొన్ని వారాలుగా షోయిగు క్రియాశీలకంగా కనిపించడం లేదు. కనీసం మీడియా సమావేశాల్లో కూడా ఎక్కడా దర్శనమివ్వలేదు. బాహ్యప్రపంచానికి కనిపించక కొన్ని వారాలు గడిచిపోయిందని చెబుతున్నాయి. 
 
ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఇప్పటివరకు పైచేయి సాధించలేకపోయింది. ఆర్థికంగా కూడా రష్యా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. షోయిగు గుండెపోటు కథనాలను బలపరస్తూ రష్యా – ఇజ్రాయెల్ వ్యాపారవేత్త లియోనిడ్ నెజ్విలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడు పుతిన్‌కు, ఆయన సన్నిహిత సలహాదారులు, మిలిటరీ నేతల మధ్య దూరం పెరిగిందని తెలిపారు. వీరి మధ్య అగాధాన్ని తెలియజేసే గత సందర్భాలను కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పుతిన్, రక్షణ అధికారుల మధ్య విభేధాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
 
ఒకప్పుడు రష్యాలో అత్యంత ధనవంతుడైన  లియోనిడ్  నెజ్విలిన్   పుతిన్ ప్రభుత్వం తన ఆయిల్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో 2012లో రష్యా నుండి వలస వచ్చారు. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించడంపై నిరసనగా తన రష్యా పౌరసత్వాన్ని వదులు కుంటున్నట్లు గత నెలలో ప్రకటించారు. 
 

“షోయిగు ఒక దశాబ్దం పాటు పుతిన్  కుడి భుజంగా, రష్యన్ సైన్యానికి నాయకుడుగా వ్యవహరిస్తున్నాడు” అని  నెజ్విలిన్    చెప్పారు. అతను ఉక్రెయిన్‌లో యుద్ధం  ప్రారంభ వారాలలో ప్రధాన పాత్ర వహించాడు. కానీ ఇటీవల సాధారణ క్రెమ్లిన్ బ్రీఫింగ్‌ల నుండి అదృశ్యమయ్యాడు. యుద్ధంలో పురోగతి చాలా తక్కువగా ఉంటూ ఉండడంతో, మార్చి చివరిలో పుతిన్ , షోయిగుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారని వివరించారు.

షోయిగు గుండెపోటుపై  నెజ్విలిన్   అనుమానం వ్యక్తం చేస్తూ ఇది సహజ కారణాల వల్ల సంభవించలేదని స్పష్టం చేశారు. హత్యాయత్నం అని ఆయన ఆరోపించా రు. ఆర్కిటిక్ అభివృద్ధి గురించి పుతిన్, ఇతర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో షోయిగు చివరిసారిగా కనిపించారు.  కానీ అతను దాని గురించి మాట్లాడలేదు. 

 
అటువంటి పరిస్థితిలో, ఈ వీడియో ఇదివరకే రికార్డ్ చేసినది కావచ్చని, కేవలం ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఈ ఫుటేజీని ఉపయోగించడం కూడా చర్చనీయాంశమైందని పేర్కొన్నారు.
 
కాగా రష్యా రక్షణమంత్రి సెర్గీ షోయిగు 2012లో బాధ్యతలు చేపట్టారు. 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. మరోవైపు 2012 నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో షోయిగు అంత సన్నిహితంగా మెలగలేదని కథనాలు చెబుతున్నాయి.