రష్యాకు అదనంగా భారత్  2 బిలియన్ డాలర్ల ఎగుమతులు

ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై భారీగా ఆంక్షల నేపథ్యంలో రష్యాకు అదనంగా 2 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. రెండు దేశాలు స్థానిక కరెన్సీలలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగించాలని కోరుతున్నందున రష్యాకు అదనంగా 2 బిలియన్ డాలర్ల సరుకులను పెంచాలని భారత్ యోచిస్తోందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 

అనేక భారతీయ ఉత్పత్తులకు మార్కెట్‌ను సరళీకృతం చేయడానికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికార యంత్రాంగం మాస్కోతో చర్చలు జరుపుతోంది. భారతదేశం రష్యన్ వస్తువుల నికర దిగుమతిదారుగా ఉన్నందున రెండు దేశాల ప్రభుత్వాలు రూపాయి, రూబుల్‌లో వాణిజ్యాన్ని జరిపే దిశగా కసరత్తు చేస్తున్నాయి. వాణిజ్యాన్ని సమతుల్యం చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నారు.

అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత అనేక దేశాలు దిగుమతులను నిలిపివేశాయి. ఏ వస్తువుల సరఫరా అయితే రష్యాకు నిలిచిపోయిందో, ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని భారత్ కోరుకుంటోంది. ఈ జాబితాలో ఔషధ ఉత్పత్తులు, ప్లాస్టిక్‌లు, సేంద్రీయ రసాయనాలు, గృహోపకరణాలు, బియ్యం, టీ, కాఫీ వంటి పానీయాలు, పాల ఉత్పత్తులు, బోవిన్ ఉత్పత్తులు ఉన్నాయి. 

ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, జపాన్‌లు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన తర్వాత తగ్గుతున్న చమురు ధరల ప్రయోజనాన్ని పొందడానికి భారత్ ప్రయత్నించింది. ఆంక్షలను కాదని భారత్ చేసే ప్రయత్నాలతో విమర్శలు వచ్చాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్ రష్యాపై తక్కువగా ఆధారపడాలని సూచిస్తూ, ఇంధన దిగుమతుల కొరత విషయంలో సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని బైడెన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.