ఆకార్ పటేల్ ప్రాసిక్యూషన్ కు సీబీఐకి కేంద్రం అనుమతి 

ఆమ్మెస్టీ ఇంటర్నేషన్‌ ఇండియా మాజీ చీఫ్‌ ఆకర్‌ పటేల్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు సీబీఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఆయనపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ)ను ఉపసంహరించాలని ఆదేశించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది.

కేంద్ర హోంశాఖ అనుమతి లేకుండా విదేశాల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా సంస్థతోపాటు ఆకర్‌ పటేల్‌పై సీబీఐ కేసులు నమోదు చేసింది. అయితే, దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నందునే తమపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆమ్నెస్టీ సంస్థ ఆరోపించింది.

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎ్‌ఫసీఆర్‌ఏ)ను అతిక్రమించారనే కేసులో రెండేళ్ల దర్యాప్తు అనంతరం ఆమ్నెస్టీ సంస్థతోపాటు ఆకర్‌ పటేల్‌పైనా సీబీఐ గతేడాది డిసెంబరు 31న సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎఫ్‌సీఆర్‌ఏ కింద నేరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్‌సీఆర్‌ఏ సెక్షన్‌ 40 నిరోధిస్తుంది.

దీంతో ఆకర్‌ పటేల్‌ను ప్రాసిక్యూట్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆ చార్జిషీట్‌ను ఈనెల 18న ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోనుందని అధికారులు చెప్పారు. ఆ చార్జిషీటు నేపథ్యంలోనే ఆకర్‌ పటేల్‌పై ఎల్‌ఓసీని సీబీఐ జారీ చేసింది.

దీంతో అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇచ్చేందుకు వెళ్తున్న ఆయనను ఇటీవల బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. దీనిపై అకార్ పటేల్ ఢిల్లీలో సిబిఐ కోర్టుకు వెళ్లి అమెరికా వెళ్ళడానికి అనుమతి పొందడమే కాకుండా, వెళ్లనున్న అడ్డుకున్నందుకు సిబిఐ ఆయనకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశంపై సిబిఐ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించగా, ఆ ఆదేశాన్ని హైకోర్టు కొట్టివేసింది.