జగన్ గురించి ఆరా తీయకండి.. ఆరాధించండి.. కొత్త మంత్రి సలహా 

బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా మాంగళవారం బాధ్యతలు చేపట్టిన  రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ జర్నలిస్ట్ లకు దిగ్బ్రాంతి కలిగే సలహా ఇచ్చారు. సచివాలయం రెండో బ్లాక్ లో తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆరాధించిన కారణంగానే తనకు మంత్రి పదవి వచ్చినట్లు తెలిపారు.

అంతటితో  ఆగకుండా, జర్నలిస్టులు కూడా  జగన్మోహన్ రెడ్డిని ఆరాధిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సలహా ఇచ్చారు. “జగన్ గురించి ఆరా తీయటం మాని ఆరాధించండి” అంటూ హితవు చెప్పారు.  పాత్రికేయుల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్న ఆయన పాత్రికేయులు కూడా సీఎం జగన్ ను మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు.  అప్పుడే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

సీఎం జగన్ గురించి ఆరా తీయడం మాని, ఆరాధించటం నేర్చుకోవాలని చెబుతూ తమ ప్రభుత్వం గురించి వాకబు చేస్తే ఇబ్బందులు తప్పవనే హెచ్చరికను పరోక్షంగా చేశారు.  మంత్రి వ్యాఖ్యానించారు. ఆరాతీస్తే ఆరాధనకు సరైన ఫలాలు రావని సున్నితంగా తెలిపారు. అయితే, ఆరా తీయడమే తమ ఉద్యోగం అంటూ జర్నలిస్టులు స్పష్టం చేశారు.

అయినప్పటికీ తనదైన శైలిలో మాట్లాడిన మంత్రి సిఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని అంటూ వారిని `ప్రలోభాలకు’ గురిచేసే ప్రయత్నం చేశారు. మంత్రి వేణు గోపాల కృష్ణ చేసిన వ్యాఖ్యలకు   పాత్రికేయులు అవాక్కయ్యారు. చిత్తశుద్ధితో ఆరాధిస్తే మీ కల తప్పక నెరవేరుతుందని మంత్రి భరోసా ఇచ్చారు.

ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ భజన చెయ్యాలని మంత్రి పాత్రికేయులకు సెలవిచ్చారు. బాధ్యతలు చేపట్టిన తొలినాడే మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ చేసిన వ్యాఖ్యలకు పాత్రికేయులు అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. పౌర సంబంధాల మంత్రి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలకు వారంతా అవాక్కయ్యారు.

ఇక మంత్రి వ్యాఖ్యలను పలువురు జర్నలిస్టులు తప్పుబడుతున్నారు. జర్నలిస్టులు అంటే ప్రభుత్వ విధానంలో ఉన్న లోపాలను ఎత్తిచూపే వారిని, ప్రభుత్వం తమ తప్పులను సరిదిద్దుకునేలా వార్తా కథనాల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వంతెనలా వ్యవహరించే వారని, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి వార్తల రూపంలో తెలియజేసేవారని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. 

రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పని చేసేవారిని, అలాంటి జర్నలిస్టులను జగన్ ను ఆరాధించమని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పౌర సంబంధాల మంత్రి పరిజ్ఞానం ఈ పాటిది అంటూ జర్నలిస్టులు మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వేణుగోపాలకృష్ణ జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయుడబ్ల్యూజే),  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజెయు) డిమాండ్ చేశాయి.  మంత్రి అవివేకానికి ఆ వాఖ్యలు నిదర్శనమని ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఇవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజెయు ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు విమర్శించారు.

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడం సమంజసం కాదని స్పష్టం చేస్తూ, మంత్రి వాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం జగన్ జర్నస్టులకు ఇచ్చిన ఇళ్ళ స్థలాల హామీ నేటికీ అమలు కాలేదని వారు గుర్తు చేశారు. 

అక్రిడేషన్ల జారీలో సమాచార శాఖ అనుసరించిన నూతన విధానంతో వేలాది మంది జర్నలిస్టులు కనీస గుర్తింపు కార్డుకు నోచుకోలేదని విమర్శించారు.ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతం గానే ఉన్నాయని చెబుతూ మంత్రి వాటిపై దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని కోరారు ఆ విషయాన్ని పట్టించుకోకుండా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి వ్యాఖ్యానించడం గర్హనీయం అని పేర్కొన్నారు.