అవిశ్వాస తీర్మానంతో పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

పలు నాటకీయ పరిణామాల మధ్య పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవీచ్యుతుడయ్యారు.  చివరి బంతి వరకు ఆడతానని ప్రకటించిన ఇమ్రాన్‌ఖాన్‌.. చెప్పినట్టే చేశారు.
శనివారం అర్ధరాత్రి 12 గంటల్లోగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఆయన తిలోదకాలిచ్చారు. అర్ధరాత్రి 12 కావడానికి 25 నిమిషాల ముందు.. పాక్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్‌ రాజీనామా చేశారు. అయితే అప్పటికప్పుడు అయాజ్‌ సాదిఖ్‌ను యాక్టింగ్‌ స్పీకర్‌గా ఎన్నుకొని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించారు.
 
ఇందులో ఇమ్రాన్‌ సర్కారు కీన్‌బౌల్డ్‌ అయింది. మెజారిటీ ఓట్లను సాధించలేక కుప్పకూలింది.  ఇక అంతకుముందు ఉదయం 10.30 గంటల నుంచి అర్ధరాత్రి దాకా వాయిదాల పరంపరతో పాక్‌ జాతీయ అసెంబ్లీని నెట్టుకొచ్చారు. 
 
‘ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం కూల్చివేతకు విదేశీ కుట్ర’ అనే అంశంపై చర్చను కొనసాగించేందుకే స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ మొగ్గుచూపారు. ముందు చర్చ.. ఆ తర్వాతే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరుగుతుందని స్పష్టంచేశారు. తాను చేస్తున్న ఈ పనికి సుప్రీంకోర్టు ఏ శిక్ష విధించినా సిద్ధమని ఆయన ప్రకటించడం గమనార్హం.
 
ఓటింగ్‌ సందర్బంగా పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 172 మంది బలం కావాల్సి ఉండగా అధికార పార్టీకి 2 ఓట్లు తగ్గాయి. దీంతో ఇమ్రాన్‌ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.  అంతకుముందు శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. గురువారం రోజున (ఏప్రిల్‌ 7న) ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరింది. 
 
తమ పార్టీ నుంచి ఫిరాయించిన అసమ్మతి జాతీయ అసెంబ్లీ సభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) సభ్యులు స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌కు ఫిర్యాదు చేశారు.  ఇదే సమయంలో పాకిస్థాన్‌ పార్లమెంటును పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. దాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించారు. ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటి వద్ద సైన్యానికి చెందిన ‘111 ఇన్‌ఫ్యాంట్రీ బ్రిగేడ్‌’ ప్రత్యక్షమవడం చర్చనీయాంశమైంది. 
 
‘‘నేను రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని కాపాడుకునే స్వార్ధంతో ఈ ప్రయత్నం చేయడం లేదు. ఒక గొప్ప లక్ష్యం కోసం ఇలా చేయాల్సి వస్తోంది. పరిస్థితిని బట్టి మేం సముచిత నిర్ణయం తీసుకుంటాం’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ శనివారం రాత్రి మీడియాకు తెలిపారు. 
 
శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశ సార్వభౌమాత్యాన్ని కాపాడాలని, దిగుమతి చేసుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ శక్తులు తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇందులో భాగంగానే పాకిస్తాన్‌ చట్టసభ్యులు గొర్రెల్లా అమ్ముడుపోయారని ఆరోపించారు.  అమెరికా దౌత్యవేత్తలు.. తమ నేతలను కలుసుకున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుయుక్తులు జరుగుతున్నాయని తెలిసిందని మండిపడ్డారు.

1992లో పాక్‌కు ప్రపంచ కప్‌ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్‌ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. 

అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్‌ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రధాన పార్టీలైన నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌), బేనజీర్‌ భుట్టోకు చెందిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు.

2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో  ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్‌ షరీఫ్‌ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనను జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు.