టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి!

టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసే పార్టీ , టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అని ప్రజలు విమర్శిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ధ్వజమెత్తారు. శనివారం కిసాన్ మోర్చా రైతు సదస్సులో ఆమె మాట్లాడుతూ… ‘‘రైతుల సమస్యపై సీఎం కేసీఆర్‌కు సోయి లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేయడం తప్పా మరోటి చేతకాదు” అంటూ ఆమె విమర్శించారు. 
 
సెంటిమెంట్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని చెబుతూ ప్రతి గింజను కొంటామని చెప్పి ఇప్పుడు డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత సీఎం కేసీఆర్ దొంగాట మొదలు పెట్టారని ఆమె తెలిపారు. కేసీఆర్‌కు కంటిపై కునుకు లేకుండా పోయిందని అంటూ ఆరువేల కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ గెలవలేకపోయిందని అరుణ గుర్తు చేశారు.
 
‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనలేదు. కేసీఆర్ తీరుతో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని ఎంఓయూ రాసిచ్చారు. హామీ ఇచ్చేది కేసీఆర్ అయితే అమలు చేసేది కేంద్ర ప్రభుత్వమా?. తెలంగాణలో వడ్ల పంచాయతీ ఎందుకు?. రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలి” అని ఆమె కోరారు. 
 
గతంలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో తట్టెడు మట్టి తీయలేదని,  చేతగాని దద్దమ్మల్లాగా, సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారని అరుణ దుయ్యబట్టారు. భూత్పూరు- మహబూబ్ నగర్ రోడ్డు గతంలోనే మంజూరు అయ్యాయని చెబుతూ ఈ పనులు పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుందా? అని ఆమె ప్రశ్నించారు. 
 
టీఆర్ఎస్ దొంగ దీక్షలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె చెప్పారు. ప్రజల సొమ్ముతో పథకాలు పెట్టి మోసం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.  ప్రధాని నరేంద్ర మోదీ చిట్ట చివరి లబ్ధిదారుకు న్యాయం చేస్తారని అరుణ భరోసా ఇచ్చారు. 
 
కాగా, రైతులను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఎంపీ అర్వింద్‌ విమర్శించారు. తెలంగాణను రైతు ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని, రైతు బంధు, పింఛన్‌ ఇస్తే కుటుంబం గడుస్తుందా? అని  ప్రశ్నించారు. కేంద్రం కొననని ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. 140 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరించిందని చెబుతూ  వంద రోజుల్లో బోధన్‌ షుగర్‌ పరిశ్రమ తెరుస్తామని చెప్పారని అర్వింద్‌ గుర్తు చేశారు. 
 
శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసింది
 
టీఆర్ఎస్ ప్రభుత్వం శిశుపాలుడిలాగా వంద తప్పులు చేసిందని చెబుతూ  101వ తప్పుకు ప్రజలు శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ఈటల రాజేందర్  హెచ్చరించారు. ‘‘ఇరవై ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నాను. తెలంగాణ సాధన ఉద్యమంలో మహబూబ్ నగర్ జిల్లా జైలుకు వెళ్లా.  ప్రజలు టీఆర్ఎస్‌ను శిక్షించి నన్ను గెలిపించారు” అని గుర్తు చేశారు. 
 
ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బు, సంపదకు కాపలాదారులు మాత్రమే అని చెబుతూ  ప్రధాని నరేంద్ర మోదీ హూందాగా తన కర్తవ్వమని చెబుతారని, కానీ  కేసీఆర్ నేనిచ్చానని చెబుతారని పేర్కొన్నారు. గజ్వేల్ లోని ఆయన సొంత భూములు అమ్మి ఇస్తున్నారా? అని  రాజేందర్ ఎద్దేవా చేశారు. 
 
కేసీఆర్ తప్పులు చేస్తూ రైతులను వెంటాడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్నారు కదా?. వ్యవసాయమే గ్రామీణ ఆర్థిక జీవనం. కంప్యూటర్ యుగంలో అన్నం పెట్టేది భూతల్లి మాత్రమే. అలాంటి వ్యవస్థను కాపాడాల్సింది పోయి వరి వేస్తే ఉరి అని స్వయానా సీఎం కేసీఆర్ చెప్పడం భావ్యమా?  అని ప్రశ్నించారు. 
 
ప్రతిపక్షాలకు ప్రజల తరఫున కొట్లాడే బాధ్యత ఉంటుంది. ప్రజలు అధికారం ఇస్తే కుర్చీపై నుంచి వెలకిలపడి ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే కుర్చీపై కూర్చునే అధికారం లేదని స్పష్టం చేశారు.