సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) కన్నుమూశారు. యూసఫ్ గూడలోని తన స్వగృహంలో బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు ఆయన విశేష సేవలందించారు. అందరివాడుగా, అతి సౌమ్యుడిగా పేరొందారు.
 
1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు. బాలయ్య. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు.
 
 ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వమూ వహించారు. డైరెక్టర్ గా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు సినిమాలు తీశారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు. 
 
వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్‌గా నటించి మెప్పించారు. కెరీర్ మొదట్లో ఎం.బాలయ్య కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. ‘ఎత్తుకు పైఎత్తు’తోపాటు ‘భాగ్యదేవత’, ‘కుంకుమ రేఖ’ మూవీల్లో ఆయన కథానాయకుడిగా కనిపించారు. బాలయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. బాలయ్య మృతి మూవీ పరిశ్రమకు తీరని లోటు అని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంతాపం తెలిపారు.