ఇమ్రాన్ గద్దె దిగడంతో అనుయాయులతో ఆందోళన 

పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రద్దయి, ఆయనకు  ప్రధాని పదవి పోవడంతో  ఆయన అనుమాయుల్లో ఆందోళన నెలకొంది. ఇన్ని రోజుల అధికారంలో ఉన్నామన్న ధీమాతో ఇష్టమొచ్చిన రీతుగా దొరికింది.. దొరికినట్లు దోచుకున్నవారికి అరెస్టుల భయం పట్టుకుంది. 
 
అందుకే దేశం విడిచిపోవాలని చూస్తున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఇమ్రాన్‌ మూడో భార్య బుష్రా బీబీకి సన్నిహిత స్నేహితురాలు  ఫరాఖాన్‌ దేశం వీడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 
 
అధికారులు వారు కోరుకున్న ప్రాంతాలు, స్థానాల్లో కొలువుతీరేందుకు ఫరాఖాన్‌ సహకరించారని, అందుకు ప్రతిఫలంగా పెద్దమొత్తంలో డబ్బు దండుకున్నారని తెలుస్తోంది. అందుకే విపక్షాలు ఈ కుంభకోణాన్ని ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ స్కాండల్స్‌’ అని విరుచుకుపడుతున్నాయి. 
 
దీని విలువ 6 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ( 32 మిలియన్ల అమెరికన్‌ డాలర్లు) ఉంటుందని మండిపడుతున్నాయి.
ఇమ్రాన్‌, ఆయన భార్య తోడ్పాటుతోనే ఫరాఖాన్‌ ఈ అవినీతికి పాల్పడ్డారని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ నేత మరియమ్‌ నవాజ్‌ విమర్శించారు. 
 
ఒకసారి తాను పదవి కోల్పోతే.. తన అవినీతి అంతా బయటపడుతుందని ఆయన భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇమ్రాన్‌కు అధికారం లేకపోవడంతో ఫరా మాదిరిగానే ఆయన సన్నిహితులు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
 
మరోవంక, పాకిస్థాన్‌లో జాతీయ అసెంబ్లీ రద్దు వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తమ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. జాతీయ అసెంబ్లీ సమావేశాల వివరాల పట్టిక (మినిట్స్)ను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ అసెంబ్లీ రద్దు, అవిశ్వాస తీర్మానం తిరస్కృతిని సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 
 
ఈ కేసు విచారణ వేగం పుంజుకోలేదు. జాతీయ అసెంబ్లీలో పరిణామాలపై సుప్రీంకోర్టు సుమోటోగా కూడా స్పందించింది. సోమవారం కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బండియాల్‌తో కూడిన ధర్మాసనం చేపట్టింది. బుధవారం మూడో రోజు విచారణ జరిగింది అధికార పిటిఐ తరఫున నేతలు బాబర్ అవాన్ , దేశాధ్యక్షులు అల్వీ తరఫున అలీ జాఫర్ హాజరయ్యారు. తమ వాదనలు విన్పించారు.