పోలీస్ పై దౌర్జన్యం … ఎంఐఎం కార్పొరేషన్ అరెస్ట్

భోలక్ పూర్ ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ ను పోలీసులు అరెస్టు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న పోలీసుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన ఎంఐఎం కార్పొరేట‌ర్ మ‌హ్మ‌ద్ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. గౌసుద్దీన్‌పై 353, 506 ఐపీసీ సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ఆ కార్పొరేట‌ర్‌ను పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

కార్పొరేట‌ర్ వ్య‌వ‌హార శైలిని ఓ నెటిజ‌న్ మంత్రి కేటీఆర్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి దృష్టికి ట్విట్ట‌ర్ ద్వారా తీసుకెళ్లారు. పోలీసుల‌కు గౌర‌వం ఇవ్వ‌కుండా దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ నెటిజ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. మంగళవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్ పూర్‎లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసి ఉంచారు.

దీంతో షాపును క్లోజ్ చేయాలని పోలీసులు సూచించడంతో ఎంఐఎం కార్పొరేటర్ గౌస్ రెచ్చిపోయి మాట్లాడాడంటూ స్థానికులు తెలిపారు. తన ఇలాకాలో పోలీసులు అడుగు పెట్టొద్దంటూ ఎంఐఎం కార్పొరేటర్ మాట్లాడాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.]

గౌస్ ఉద్దీన్ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై యాక్షన్ తీసుకోవాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ వీడియోను చూసిన మంత్రి కేటీఆర్ గౌస్ ఉద్దీన్‌పై ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టవద్దని తెలంగాణ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ‘‘డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తెలంగాణలో ఇలాంటి మూర్ఖత్వాలను సహించవద్దని.. రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని అభ్యర్థిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.