కేటీఆర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం… బొమ్మై ఎద్దేవా

బెంగళూరు వర్సెస్‌ హైదరాబాద్‌ అంశంపై తెలంగాణ ఐటి మంత్రి కె టి రామారావు చేసిన వాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంటూ
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఎద్దేవా చేశారు.  బెంగళూరులో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయంటూ ఓ వ్యాపారవేత్త చేసిన ట్వీట్‌కు.. బ్యాగ్‌ సర్దుకొని హైదరాబాద్‌కు వచ్చేయమంటూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన రీట్వీట్‌ పై ఆయన తీవ్రంగా స్పందించారు.
మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉంటే వందలాది స్టార్ట్‌పలు, పరిశోధనా సంస్థలు బెంగళూరులో ఎందుకు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు. ఐటీ బీటీ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కేటీఆర్ కు ఆయన హితవు పలికారు. ‘‘దేశంలోకి వస్తున్న ఎఫ్‌డీఐల్లో దాదాపు 40 శాతం కర్ణాటకలోకే వస్తున్నాయి. ఈ విషయంలో వరుసగా గత మూడు త్రైమాసికాల్లో కర్ణాటకే నంబర్‌ వన్‌. కాబట్టి కర్ణాటకతో తెలంగాణకు, బెంగళూరుతో హైదరాబాద్‌కు పోలిక పెద్ద జోక్‌’’ అని బొమ్మై స్పష్టం చేశారు.
 ‘‘కేవలం భారతదేశం నలుమూలల నుంచే కాదు.. యావత్‌ ప్రపంచం నుంచే బెంగళూరుకు తరలి వస్తుంటారు. అత్యధిక స్టార్ట్‌పలు ఇక్కడే ఉన్నాయి. మిలియన్లు, బిలియన్ల డాలర్ల విలువైన అనేక కంపెనీలు ఉన్నాయి’’ అని బొమ్మై ఈ సందర్భంగా చెప్పారు.
కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ కూడా దీనిపై స్పందిస్తూ  అమెరికా నగరాలు, సింగపూర్‌తో బెంగళూరు పోటీ పడుతోందని చెప్పారు. సిలికాన్‌ సిటీ పేరిట బెంగళూరు నగరం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిందన్న సంగతి కేటీఆర్‌కు తెలియకపోవడం విచారకరమని సానుభూతి తెలిపారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లోనూ ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. హిజాబ్‌, అజాన్‌, హలాల్‌ వివాదాలతో బీజేపీకి సంబంధం లేదని.. కాంగ్రెస్‌, జేడీఎ్‌సలే రాజకీయం చేస్తున్నాయని ఆయన  మండిపడ్డారు.