పేదలు చదువుకొనే స్కూళ్లను మూసివేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం

విద్యార్థులు లేరనే కుంటిసాకుల‌తో పేద విద్యార్థులు చ‌దువుకునే స్కూళ్లను ఎవ‌రి అభిప్రాయాల‌తోనూ సంబంధం లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా మూసేస్తోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగు దొడ్ల ఏర్పాటులో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీలో ఉన్న ప్రైమరీ స్కూల్‌లో ఐదో తరగతి వరకున్న 120 మంది పిల్లలకు ఒకే తరిగి గది  ఉందని ఆమె చెప్పారు. స్కూల్ ఆవరణలో ఉన్న టాయిలెట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, తాగునీటి సౌకర్యం లేదని ఆమె తెలిపారు. తాగునీటి కోసం విద్యార్థులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని విజయశాంతి చెప్పారు.

ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి సిద్ధాంతి బస్తీ స్కూల్‌‌ను ఎంపిక చేయకపోవడం దారుణమని ఆమె విమర్శించారు. స్కూల్ సమస్యల గురించి స్థానిక కౌన్సిలర్, ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన క‌రువైంద‌ని టీచర్లు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. 

ప్రహరీకి గేటు లేకపోవడంతో రాత్రి వేళ ఈ పాఠ‌శాల‌ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని విజయశాంతి చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకాలోనే ఈ దుస్థితి ఏర్పడిందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. మంత్రుల జిల్లాల్లోనే ఈ ప‌రిస్థితి ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చని ఆమె ఎద్దేవా చేశారు. ఇలాంటి స్కూళ్లలో ముఖ్యమంత్రి మ‌నుమ‌డు చ‌ద‌వ‌గ‌ల‌డా? అని విజయశాంతి ప్రశ్నించారు.